సరిహద్దుల్లో హోరాహోరీ కాల్పులు
శ్రీనగర్ : పాక్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులకు.. భారత సైన్యానికి మధ్య హోరాహోరిగా కాల్పులు కొనసాగుతున్నాయి. బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్‌లో జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది మరణించారు. వీరిలో ఐదుగురు సైనికులు, ఇద్దరు పోలీసులు, ఇద్దురు ఉగ్రవాదులు ఉన్నారు.
మొదటగా పోలీసులపై కాల్పులు జరుపుతూ... ఉగ్రవాదులు యూరీ సెక్టార్‌లోని ఓ బంకర్‌లోకి చొరబడ్డారు. వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదుల కూడా ప్రతిఘటిస్తున్నారు. బంకర్‌లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. ఎంతమంది ఉన్నారు.. అనే విషయాన్ని మాత్రం అధికార్లు వెల్లడించలేకపోతున్నారు. ఉగ్రవాదులు ఉన్న బంకర్‌ను దిగ్బంధం చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో ఉగ్రవాదులు ఎవరైనా మరణించిన విషయాన్ని కూడా అధికారులు వెల్లడించలేదు.