ఒక్క రోజులో.. 918 కేసులు.. 31 మరణాలు | 918 coronavirus cases And 31 lifeless reported in 24 hours | Sakshi
Sakshi News home page

ఒక్క రోజులో.. 918 కేసులు.. 31 మరణాలు

Published Mon, Apr 13 2020 3:57 AM | Last Updated on Mon, Apr 13 2020 4:29 AM

918 coronavirus cases, 31 deaths reported in 24 hours - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా నిర్మానుష్యంగా మారిన ఢిల్లీలోని లోటస్‌ టెంపుల్‌ పరిసరాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. శనివారం నుంచి ఆదివారం వరకు.. 24 గంటల్లో దేశంలో కొత్తగా 918 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే 31 మంది కరోనా కాటుతో మృతి చెందారని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసులు 8,447కు, మొత్తం మరణాలు 273కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఆదివారం మీడియాతో చెప్పారు. యాక్టివ్‌ కరోనా కేసులు 7,367 కాగా, 715 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. గత 24 గంటల్లో 74 మంది కోలుకున్నారని వివరించారు.  

కేసులు, మరణాల్లో మహారాష్ట్రదే అగ్రస్థానం  
కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 127 మంది బలయ్యారు. మధ్యప్రదేశ్‌లో 36 మంది, గుజరాత్‌లో 22 మంది, ఢిల్లీలో 19, పంజాబ్‌లో 11 మంది, తమిళనాడులో 10 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1,761 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,069, తమిళనాడులో 969, రాజస్తాన్‌లో 700, మధ్యప్రదేశ్‌లో 532, ఉత్తరప్రదేశ్‌లో 452, కేరళలో 364, గుజరాత్‌లో 432, కర్ణాటకలో 214, జమ్మూకశ్మీర్‌లో 207, పంజాబ్‌లో 151, పశ్చిమబెంగాల్‌లో 124 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.   

అభివృద్ధి దశలో 40కిపైగా వ్యాక్సిన్లు  
కరోనాను అంతం చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్‌ తయారీ పరిశోధనలు కొనసాగుతున్నాయని లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ప్రస్తుతం 40కిపైగా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి 20 వేల రైల్వే కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చనున్నట్లు ఉద్ఘాటించారు. తొలి దశలో ఇప్పటికే 5 వేల కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చినట్లు తెలిపారు.  

రోజుకు సగటున 584 పాజిటివ్‌ కేసులు  
దేశంలో ఇప్పటిదాకా 1,86,906 కరోనా నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) తెలియజేసింది. వీటిలో 7,953 నమూనాలు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించింది.  ఐదు రోజులుగా రోజుకు సగటున 15,747 నమూనాలను పరీక్షిస్తున్నామని, అందులో సగటున 584 నమూనాలు కరోనా పాజిటివ్‌గా తేలుతున్నాయని స్పష్టం చేసింది.

ఆ డాక్టర్ల సేవలను వాడుకోండి  
కరోనా వైరస్‌పై పోరాటంలో చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) డాక్టర్లు, రెసిడెంట్‌  డాక్టర్ల సేవలను సైతం ఉపయోగించుకోవాలని కేంద్రం  రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ప్రజల నుంచి నమూనాలను సేకరించడానికి వీరిని వాడుకోవాలంది.

హాట్‌స్పాట్‌లలో ఇళ్ల వద్దకే సరుకులు
కోవిడ్‌–19 హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇళ్ల వద్దకే నిత్యావసరాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య, స్థానికంగానూ అన్ని రకాలైన సరుకు రవాణా వాహనాలను ఎటువంటి ఆటంకం లేకుండా అనుమతించాలని రాష్ట్రాలను తమ శాఖ కోరినట్లు హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ ఆదివారం మీడియాకు తెలిపారు. ‘హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లోని ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావాల్సిన అవసరం లేకుండా అత్యవసర వస్తువులను వారి ఇళ్ల వద్దకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకు వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నాయి’ అని వివరించారు. సైబర్‌ నేరాలపై తమ శాఖ అందుబాటు లోకి తెచ్చిన ‘సైబర్‌దోస్ట్‌’ అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.

కీలక రంగాలకు కొన్ని మినహాయింపులు!
కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలైనా పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు  కోరుతున్నాయి. కరోనా తీవ్రత అంతగా లేని ప్రాంతాల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కార్యకలాపాలు పున:ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  దీంతో టెక్స్‌టైల్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, ఫార్మాస్యూటికల్‌ రంగాల్లో ఉత్పత్తికి షరతులతో అనుమతివ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.  కీలక రంగాలకు ఆంక్షల నుంచి కొన్ని మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. జాతీయ రహదారుల నిర్మాణ పనులను పున:ప్రారంభించాలని యోచిస్తున్నా మని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పట్టణాలు, నగరాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ఈ పనుల్లో ఉపయోగించుకుంటామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement