సల్మాన్ ఖాన్ కు ఎదురు దెబ్బ!
ముంబై: 2002 లో నమోదైన హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దుర్ఘటన జరిగిన రాత్రి కారులో డ్రైవర్ సీటులో సల్మాన్ ఖాన్ ఉన్నాడని కీలక సాక్షి తన వాగ్మూలాన్ని ఇచ్చారు. 2002 సెప్టెంబర్ 28 తేదిన ప్రమాదం జరిగడానికి ముందు, జే డబ్ల్యూ మారియట్ హోటల్ నుంచి కారులో వెళ్లే సమయంలో సల్మాన్ ఖాన్ డ్రైవర్ సీటులోనే ఉన్నారని హోటల్ పార్కింగ్ అసిస్టెంట్ ధృవీకరించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా, నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే.
ప్రమాదానికి ముందు తన స్నేహితులతో తమ రెస్టారెంట్ కు వచ్చారని లిక్కర్ బార్ మేనేజర్ కూడా కోర్టుకు వెల్లడించారు. అయితే సల్మాన్ ఖాన్ మద్యం సేవించారా లేదా అనే విషయాన్ని తాను గమనించలేదని వెయిటర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, కేస్ డైరీలు కనిపించకుండా పోయాయని కోర్టు దృష్టికి రావడంతో.. ఆ పత్రాలను వెతికి తీసుకురావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ సెప్టెంబర్ 24 తేదికి వాయిదా వేశారు.