'ఆ సీఎం ఓ డంప్‌యార్డ్.. అన్ని పార్టీల చెత్త అక్కడికే'
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీపై పంజాబ్ లోని శిరోమణి అకాళీదల్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆప్ ఇతర పార్టీల్లోని చెత్తను(ఇతర పార్టీలకు చెందిన విఫల నాయకులను) ఏరుకుంటుందని వ్యంగ్యంగా విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీని విస్తరించుకునేందుకు పంజాబ్నే క్షేత్రంగా ఎంచుకుందని ఆరోపించారు. 'ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం చెత్తను మాత్రమే నిర్వహిస్తోంది. అది అన్ని పార్టీల్లోని చెత్తను ఏరుకుంటోంది. అన్ని పార్టీల చెత్త కూడా కేజ్రీవాల్ డంప్ యార్డ్లోకి వచ్చి పడుతున్నాయి' అంటూ ఆయన మీడియా సమావేశంలో చెప్పారు.
కేజ్రీవాల్ ఒక ఆందోళనకారుడు మాత్రమే. ఆయన ఆయన ఆలోచన స్థాయిని మెరుగుపరుచుకోలేదు. ఢిల్లీలో ఆయన అంతగా చేసేందేమీ లేదు. ఆయన దగ్గర ఏ పోర్ట్ఫోలియో లేదు.. ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. కేవలం పంజాబ్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాడు. కేజ్రీవాల్ ఒక మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు మాత్రమే. అంతకుమించి ఏమీ లేదు. ఆయన పంజాబ్ కు రావడం ద్వారా దేశ నేతగా మారి మోదీపై పోరాడాలని అనుకుంటున్నారు' అని ఆయన అన్నారు. గోల్డెన్ టెంపుల్ అంటే తెలియని కేజ్రీవాల్ను పంజాబ్ ప్రజలు తరిమి కొడతారని జోస్యం చెప్పారు. పంజాబ్ గురించి కేజ్రీవాల్ కు సరిగా తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.