
'ఆ ముగ్గురూ రాజీనామా చేయాల్సిందే'
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారుపై ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విరుచుకుపడింది. బీజేపీలో కీలక స్థానాల్లో ఉన్న కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతీ ఇరానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలపై వివాదాలు చుట్టిముట్టినా.. ఆ అంశానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడం లేదని ఆప్ ప్రశ్నించింది. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ముగ్గురూ తక్షణమే రాజీనామా చేయాలంటూ ఆప్ నిరసన బాట పట్టింది. దీనిలో భాగంగా ఆప్ శ్రేణులు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాయి. డిగ్రీ పట్టాకు సంబంధించి స్మృతీ ఇరానీ అబద్దాలు చెప్పారని, ఆమెపై కేసు కూడా నమోదైందని పేర్కొన్న ఆప్ నేతలు.... ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఇంకా ఆ పదవిలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. స్మృతి ఇంటి వద్దకు దూసుకెళ్లేందుకు యత్నించిన ఆప్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఇదిలా ఉండగా లలిత్ మోదీ వీసా వివాదానికి సంబంధించి బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తోంది. సుష్మా స్వరాజ్, వసుంధర రాజేలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మహిళా విభాగం ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని బీజేపీ ఆఫీసు వద్ద ధర్నాకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు సుష్మా, రాజేలను బర్తరఫ్ చేయాలని నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.