ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేసు పెట్టినందుకు నిరసనగా ఆప్ ఆందోళన బాట పట్టింది.
- సిసోడియాపై కేసుకు నిరసనగా ప్రధాని ఇంటి వద్దకు ర్యాలీ
- మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేసు పెట్టినందుకు నిరసనగా ఆప్ ఆందోళన బాట పట్టింది. ప్రధాని మోదీ ఎదుట సిసోడియా లొంగిపోతారని సీఎం కేజ్రీవాల్ ప్రకటించడంతో ఆరుగురు మంత్రులతో సహా 52 మంది ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయం 7 రేస్ కోర్స్ వరకు ర్యాలీగా బయలుదేరారు. అయితే వారిని పోలీసులు కిలోమీటరు దూరంలోనే అడ్డుకొని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాసేపయ్యాక విడుదల చేశారు. ‘ఢిల్లీ ప్రజల కోసం మమ్మల్ని పనులు చేయనివ్వండి అని చెప్పడానికి మోదీజీని కలవాలనుకున్నాం.
మమ్మల్ని జైలుకు పంపి రాజకీయాలు చేయాలనుకుంటే అలాగే కానివ్వండి. అంతేగానీ పనులను అడ్డుకోవద్దు’ అని ఎమ్మెల్యేలకు నేతృత్వం వహించిన సిసోడియా పేర్కొన్నారు. సిసోడియా తమను బెదిరించాడంటూ ఘాజిపూర్ మార్కెట్ వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో శనివారం కేసు నమోదైంది. కాగా, తాను మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీ చేయగా అక్కడ కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించానని, ఆ పనులు మానుకోవాలని హెచ్చరించడంతో తనపై కేసు పెట్టారని సిసోడియా తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి కిరిన్ రిజిజు స్పందిస్తూ.. ఆప్ ప్రభుత్వం నాటకాలాడుతోందని మండిపడ్డారు.