మోదీ రికార్డులను పరిశీలించనున్న'ఆప్'
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ బిఏ, ఎంఏ డిగ్రీలను బిజెపి ప్రెసిడెంట్ అమిత్ షా సోమవారం మీడియా ముందు బయట పెట్టినప్పటికీ.. ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ మాత్రం... అవి ఫోర్జరీ సర్టిఫికెట్లనీ, ఢిల్లీ యూనివర్శిటీకి వెళ్ళి తాము స్వయంగా రికార్డులు పరిశీలిస్తామని వెల్లడించారు.
నరేంద్ర మోదీ పేరు.. రెండు డిగ్రీల్లో వేరు వేరుగా ఉందని ఆప్ ప్రతినిధి అసుతోష్ ఆరోపిస్తున్నారు. తన వద్ద ఉన్న మోదీ విద్యార్హతల కాపీలకు, షా చూపించిన వాటికి తేడా ఉందని, అందుకే అవి నకిలీవిగా తేలిపోయిందన్నారు. మోదీ పేరు బిఏ, ఎంఏ డిగ్రీల్లో వేరు వేరుగా ఉందన్నారు. బిఏ పార్ట్ 1 లో నరేంద్ర కుమార్ దామోదర్ దాస్ మోదీ అని ఉండగా... రెండో సంవత్సరం మార్కు షీట్ లో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని ఉందన్నారు. అయితే మోదీ ఎంఏ తొలి ఏడాదిలో తన పేరును నరేంద్ర కుమార్ దామోదర్ దాస్ మోదీగా పేర్కొన్నట్లు గుజరాత్ యూనివర్శిటీ తెలిపింది. రెండో సంవత్సరంలో పేరులోని కుమార్ ను తీసేసి నరేంద్ర దామోదర్ దాస్ మోదీగా మార్చుకున్నారని తెలిపింది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఆప్ నేతలు.. బిజెపి ప్రెసిడెంట్ అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో కలసి ఢిల్లీ యూనివర్శిటీలో మోదీ సర్టిఫికెట్ల రికార్డులను పరిశీలించేందుకు నిర్ణయించారు. కేజ్రీవాల్ వద్ద సీఐసీ ఆర్డర్ ఉన్నపుడు ఢిల్లీ యూనివర్శిటీ మోదీ డిగ్రీల అసలు పత్రాలు బయటపెట్టాల్సిన అవసరం ఉందని... వాటిని సీల్డ్ గా ఉంచి, ఎందుకు భయపడుతున్నారని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ధైర్యం ఉంటే మోదీ సర్టిఫికెట్లలో పేరు మార్చుకున్న విషయంపై అఫిడవిట్ ఇవ్వాలని ఆప్ నేత అశుతోష్ బిజెపికి ఛాలెంజ్ విసిరారు.