ఆత్మహత్యకు ముందు 400 నిమిషాల ఫోన్ కాల్! | Actor Jiah Khan Committed Suicide, CBI Concludes | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు ముందు 400 నిమిషాల ఫోన్ కాల్!

Published Thu, Dec 10 2015 3:35 PM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

ఆత్మహత్యకు ముందు 400 నిమిషాల ఫోన్ కాల్!

ఆత్మహత్యకు ముందు 400 నిమిషాల ఫోన్ కాల్!

హీరోయిన్ జియాఖాన్‌ది ఆత్మహత్యేనని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. అయితే, ఆత్మహత్య చేసుకోడానికి ముందురోజు రాత్రి ఆమె సూరజ్ పాంచోలీకి ఫోన్ చేసిందని, ఆ కాల్ దాదాపు 400 నిమిషాల పాటు కొనసాగిందని సీబీఐ చెబుతోంది.

నటుడు సూరజ్ పాంచోలితో సంబంధాలు చెడిపోవంతో ఆమె 2013 జూన్ 3న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణులు ఆమె మరణానికి కారణం ఆత్మహత్యేనని తేల్చారని, పోస్టుమార్టం చేసిన వైద్యుడి నివేదికతో కూడా ఇది సరిపోయిందని సీబీఐ స్పష్టం చేసింది. జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్‌ను కూడా ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించారని, సంతకం పెట్టకుండా మూడు పేజీలలో రాసిన ఆ లేఖ ఆమె మానసిక స్థితికి అద్దం పడుతోందని సీబీఐ తెలిపింది.

సీనియర్ నటులు ఆదిత్య పాంచోలి, జరీనా వహాబ్‌ల కొడుకైన సూరజ్ పాంచోలీపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసులు పెట్టారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఈ కేసు పెట్టారు. అంతేతప్ప ఇది హత్య మాత్రం కాదని తేలింది. నిందితుడి ప్రవర్తనను, అతడితో తనకున్న సన్నిహిత సంబంధాన్ని, శారీరక, మానసిక హింసను అన్నింటినీ నఫీసా రిజ్వీ అలియాస్ జియాఖాన్ తన సూసైడ్ నోట్‌లో వివరంగా రాసింది. వాటివల్లే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది.

చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు వరకు ఆమె సూరజ్ ఇంట్లోనే ఉంది. ఇద్దరి మధ్య మొబైల్ ఫోన్లో బాగా వాగ్యుద్ధం జరిగిందని, ఇద్దరికీ తెలిసిన ఓ అమ్మాయిని కలిసిన విషయంపై అతడు అబద్ధం చెప్పినట్లు ఆమె ఆరోపించిందని కూడా అంటున్నారు. ఆమె పదే పదే మెసేజిలు చేయడంతో.. తన మొబైల్‌లో జియా బ్లాక్ బెర్రీ మెసెంజర్ అకౌంటును సూరజ్ పాంచోలి డిలిట్ చేసేశాడని కూడా సీబీఐ పేర్కొంది.

తర్వాత జియాఖాన్ అర్ధరాత్రి సమయంలో అతడికి ఫోన్ చేయగా మరోసారి ఇద్దరిమధ్య వాగ్యుగద్ధం నడిచింది. ఆ కాల్ దాదాపు 400 నిమిషాలు కొనసాగింది. తల్లి రబియా ఇంటికి తిరిగి వచ్చేసరికే  జియా ఖాన్ తన బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement