
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం మంగళవారం లోక్‌సభలోనూ పెను ప్రకంపనలు రేపింది. ఆర్టికల్ 370ను ద్వైపాక్షిక అంశంగా ఎందుకు పరిగణించడం లేదంటూ హోంమంత్రి అమిత్ షాను కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చౌదరి ప్రశ్నించడంతో సభలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కశ్మీర్‌పై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలంటూ అమిత్ షా నిలదీయడంతో అధీర్ రంజన్ తీరుతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది.
ఆర్టికల్ 370 అంతర్గత వ్యవహారమని ప్రభుత్వం చెబుతోందని, కశ్మీర్ పరిణామాలను 1948 నుంచి ఐక్యరాజ్యసమితి పర్యవేక్షిస్తున్న క్రమంలో, సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్‌లపై సంతకాలు చేసిన నేపథ్యంలో అది అంతర్గత వ్యవహారం ఎలా అవుతుందని అధీర్ ప్రశ్నించారు. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని చెబుతూ అమెరికా జోక్యం చేసుకోరాదని గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
జమ్ము కశ్మీర్ ఇప్పటికీ అంతర్గత అంశమనే మీరు చెబుతారా అన్నది తమ పార్టీ తెలుసుకోవాలనుకుంటోందని అన్నారు. నిబంధనలకు పాతరేస్తూ జమ్మూ కశ్మీర్‌ను రాత్రికి రాత్రి కేంద్ర పాలిత ప్రాంతం చేశారని దుయ్యబట్టారు. కాగా, జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్‌లో భాగమేనని అమిత్ షా బదులిచ్చారు. కశ్మీర్‌లోయలో ఐరాస జోక్యాన్ని కాంగ్రెస్ ఆశిస్తోందా అని నిలదీశారు. కశ్మీర్‌పై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment