
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో మతఘర్షణలకు సంబంధించిన ఉద్రిక్తతలు చల్లారముందే అమేథిలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు చనిపోగా.. ఐదుగురు గాయపడ్డారు. అయితే, ఇవి మతఘర్షణలు కాదని, కుటుంబ వైరం వల్లే రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.
ఇక, ఒకరి ప్రాణాలు బలితీసుకున్న కాస్‌గంజ్ మతఘర్షణలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్‌గా స్పందించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘ప్రతి ఒక్క పౌరునికి భద్రత కల్పించేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. అరాచకాలకు దిగే వాళ్లను సహించే ప్రసక్తే లేదు. హింసకు బాధ్యులైన వాళ్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటాం’ అని యోగి మీడియాతో పేర్కొన్నారు. మరోవైపు కాస్‌గంజ్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదిక కోరింది.