త్వరలో ‘లోకల్’ అదనపు ట్రిప్పులు | administrative division of central railway has decided to additional trips | Sakshi
Sakshi News home page

త్వరలో ‘లోకల్’ అదనపు ట్రిప్పులు

Published Sun, Sep 7 2014 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

administrative division of central railway has decided to additional trips

సాక్షి, ముంబై: లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార. రద్దీ బాధల నుంచి త్వరలో స్వల్ప ఉపశమనం లభించనుంది. ఇందులోభాగంగా అదనంగా కొన్ని టిప్పులను నడపాలని సెంట్రల్ రైల్వే పరిపాలనా విభాగం నిర్ణయించింది. తక్కువ దూరం ప్రయాణించే వారికోసం 15 అదనపు ట్రిప్పులు నడపనుంది. ఈ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందులోభాగంగా కొన్ని రైళ్ల టైంటేబుల్‌లో స్వల్ప మార్పులుచేర్పులు చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం లోకల్ రైళ్లు ప్రతిరోజూ సుమారు 45,500 కిలోమీటర్ల దూరం పరుగులు తీస్తున్నాయి.

అయితే అదనపు ట్రిప్పుల కారణంగా ఇకమీదట 45,648 కి.మీ. మేర పరుగులు తీయనున్నాయి. కొత్త టైం టేబుల్‌ను సిద్ధం చేయగానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఛత్రపతి శివాజీ టెర్మినస్-కుర్లా మధ్య మూడు,  కల్యాణ్-దాదర్ మధ్య రెండు ట్రిప్పుల చొప్పున నడపనున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. ఈ ఐదు ట్రిప్పులవల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులకు రద్దీ నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కువ దూరానికి ట్రిప్పుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి.

 దీంతో గత్యంతరం లేక అనేక మంది ప్రయాణికులు దూరం వెళ్లే లోకల్ రైళ్లలోనే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆ రైళ్లలో రాకపోకలు సాగించేవారు వీరిపై పెత్తనం చెలాయిస్తున్నా రు. మీకు ప్రత్యేకంగా కుర్లా, దాదర్ లోకల్ రైళ్లు ఉండగా, ఈ రైళ్లలో ఎందుకు ప్రయాణిస్తున్నారంటూ గట్టిగా నిలదీస్తున్నారు. మీ కారణంగానే ఈ రైళ్లు కిక్కిరిసిపోతున్నాయంటూ గొడవలకు దిగుతున్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడేవారంతా జట్లు జట్లుగా ఉండడంతో  ఒంటరి ప్రయాణికులు ఏమీచేయలేకపోతున్నారు.

 లోకల్ రైళ్ల హాల్ట్ వేళల్లో స్వల్ప మార్పులు
 గణేశ్ చతుర్ధి సందర్భంగా సోమవారం జరగనున్న  నిమజ్జన ఉత్సవాలకు గిర్గావ్ (చర్నిరోడ్) చౌపాటీకి వచ్చే ప్రజల సౌకర్యార్ధం పశ్చిమ రైల్వే పరిపాలనా విభాగం లోకల్ రైళ్ల హాల్ట్ వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ముంబై సెంట్రల్-చర్చిగేట్ మధ్య అన్ని స్టేషన్లలో ఫాస్ట్ అప్, డౌన్ రైళ్లకు హాల్టు ఇచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చర్నిరోడ్ స్టేషన్‌లో స్లో లోకల్ రైళ్లు ఆగవని ఆదివారం విడుదల చేసిన ఓ  ప్రకటనలో సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

గణపతి నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు నగరంతోపాటు శివారు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన సార్వజనీక గణేశ్  ఉత్సవ మండళ్లకు చెందిన భారీ వినాయక విగ్రహాలన్నింటినీ నిమజ్జనానికి చర్నీరోడ్ చౌపాటీకే తరలిస్తారు. లాల్‌బాగ్ చా రాజా, గణేశ్ గల్లీ, జీఎస్‌బీ లాంటి ప్రముఖ మండళ్ల విగ్రహాలన్నీ ఇక్కడికే వస్తాయి. దీంతో నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు ఇక్కడికే వెళతారు. దూరప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చే వారిలో అత్యధిక శాతం జనం చర్నీరోడ్ స్టేషన్‌లోనే రైలు దిగుతారు.

 దీంతో ఈ స్టేషన్‌పైప్రయయాణికుల భారం విపరీతంగా పడుతుంది. ఇక్కడ హాల్ట్ లేకపోవడంవల్ల రైలు ఎక్కాలన్నా... దిగాలన్నా.... గ్రాంట్ రోడ్ లేదా మెరైన్ లైన్స్ స్టేషన్లకు వెళుతుంటారు. దీంతో చర్నిరోడ్ స్టేషన్‌లో స్లో రైళ్లకు హాల్టు ఇవ్వకూడదని, ఫాస్ట్ రైళ్లకు మాత్రమే హాల్టు ఇవ్వాలని నిర్ణయించామని రైల్వే వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement