ట్రంప్ ప్లాన్.. యుద్ధంలోకి భారత్ వెళ్తుందా?
ఆప్ఘనిస్తాన్ లో మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ను ఉపయోగించడం ద్వారా అమెరికా ఇచ్చిన సంకేతం యుద్ధం సైనికపరంగానే కాకుండా రాజకీయంగా, దౌత్య పరంగా మరింత ఉధృతం కాబోతోందని. ఆప్ఘనిస్తాన్ యుద్ధంలో భారత్ ను భాగస్వామ్యం చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. ఇందుకోసం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) మెక్ మాస్టర్ భారత్ లో పర్యటించనున్నారు.
అంతేకాదు పాకిస్తాన్ ను కూడా ఆప్ఘన్ యుద్ధంలోకి తీసుకొచ్చేందుకు ట్రంప్ సర్కారు పక్కా ప్రణాళిక రచించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భారత్ సర్కారుకు మంచి దోస్తీ కుదరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా అమెరికా ఆప్ఘన్ యుద్ధానికి సంబంధించిన విషయాలను భారత్ తో ఎన్నడూ పంచుకోలేదు. పాకిస్తాన్నయితే అసలు పట్టించుకోనేలేదు. ఉన్నట్లుండి భారత్ ను యుద్ధంలోకి ఆహ్వానించడం వెనుక పెద్ధ ఆలోచనే దాగి ఉంది. అది అమెరికాకు భారీగా లాభం చేకూర్చేదే తప్ప భారత్ కు వచ్చే లాభం తెచ్చేది కాదు.
మెక్ మాస్టర్ మిషన్ ఏంటి?
జనరల్ మెక్ మాస్టర్ ను ఆప్ఘానిస్తాన్ పంపుతున్నట్లు ఈ నెల 12వ తేదీన ట్రంప్ మీడియా సమావేశంలో ప్రకటించారు. తాలిబన్లకు చెక్ పెట్టేందుకే ఆయన మెక్ ను ఆప్ఘాన్ కు పంపుతున్నారన్నది నిపుణుల అభిప్రాయం. అయితే, మరో విషయాన్ని కూడా ట్రంప్ కీలకంగా భావిస్తున్నారు. యుద్ధాలపై అమెరికా చేస్తున్న ఖర్చులను తగ్గించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే ఆప్ఘనిస్తాన్ యుద్ధానికి వేలల్లో సైన్యం అవసరమని అక్కడి జనరల్ జాన్ నికోల్సన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా సోల్జర్స్ ను పంపేందుకు ట్రంప్ విముఖత చూపుతున్నారు. మరో వైపు ఇరాక్, సిరియా, లిబియాల్లో జరుగుతున్న యుద్ధాలను మాత్రం అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఈ దశలో ఆప్ఘనిస్తాన్ లో సైన్యం కోసం భారత్, పాకిస్తాన్ ల సాయం తీసుకునే యోచన చేశారు ట్రంప్.
యుద్ధంలో భారతే ఎందుకు?
ఆప్ఘన్ యుద్ధంలో పాల్గొంటున్న సైనికులందరూ(ఆప్ఘన్ సైనికులు కూడా) తమ ఆయుధాలనే ఉపయోగించాలని అమెరికా నొక్కి చెబుతోంది. ఎందుకంటే ఆప్ఘనిస్తాన్ పొరుగు దేశమైన రష్యా నుంచి భారీగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. యుద్ధానికి సాయం చేస్తున్నాం కదా.. మా ఆయుధాలను ఎందుకు తీసుకోరు? అనే తరహాలో అమెరికా ఆప్ఘనిస్తాన్ పై ఒత్తిడి తెస్తోంది.
మరి అమెరికా ఆయుధాలను కొనుగోలు చేయగలిగినంత ఆప్ఘనిస్తాన్ కు లేదు. దీనికి కూడా ఉపాయం ఆలోచించిన అమెరికా ఏడాదికి దాదాపు 4 బిలియన్ డాలర్లను భారత్ ద్వారా ఆప్ఘనిస్తాన్ కు ఆర్థిక సాయం ఇప్పించాలని ప్రయత్నిస్తోంది. ఎన్ని సంవత్సరాల పాటు భారత్ ఆప్ఘనిస్తాన్ కు సాయం చేయగలదనే విషయంపై కూడా అమెరికా దృష్టి పెట్టింది. మెక్ పర్యటన ముఖ్య ఉద్దేశం ఇదే.
ఒక వేళ అమెరికా ప్రపోజల్ కు ఒప్పుకుంటే రష్యా ఆదాయానికి భారత్ గండిగొట్టినట్లు అవుతుంది. భారత్-రష్యాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఆయుధాల విషయం మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా ప్రపోజల్ కు ఒప్పుకుంటే రష్యాతో భారత్ సంబంధాలు చెడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అగ్రరాజ్యంతో అనుబంధం పెరుగుతుందని భావించి యుద్ధానికి సాయం చేసేందుకు భారత్ ఒప్పుకున్నా.. తాలిబన్లపై సైన్యం గెలుస్తుందని అమెరికా కచ్చితంగా చెప్తుందా?. చెప్పలేదు.
ఎందుకంటే కొద్ది వేల మందితో యుద్ధం గెలవడం అసాధ్యం. ఏదో ఒకరోజు తాలిబన్లతో అమెరికా రాజీ కుదుర్చుకుంటుంది. దానివల్ల భారత్ కు ఒరిగేది ఏముండదు. ఎన్నో వ్యయ ప్రయాసలు చేయాల్సిన దానిపై భారత్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో భారత్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.