ప్రధాని ఆర్డర్స్: 300 కంపెనీలపై ఉక్కుపాదం
ప్రధాని ఆర్డర్స్: 300 కంపెనీలపై ఉక్కుపాదం
Published Sat, Apr 1 2017 3:25 PM | Last Updated on Mon, Sep 17 2018 7:45 PM
న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న షెల్ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని ప్రధాని నరేంద్రమోదీ ఆఫీసు ఆదేశించిన వారం రోజుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో కనీసం 300 షెల్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఎన్నఫోర్స్మెంట్ శనివారం రైడ్స్ ప్రారంభించింది.16 రాష్ట్రాల్లోని 100 పైగా ప్రాంతాలకు సంబంధమున్న 300 షెల్ కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ దాడుల్లో ఇప్పటికే ఓ ముంబాయి ఆపరేటర్ 20 డమ్మీ డైరెక్టర్లతో 700 షెల్ కంపెనీలను రన్ చేస్తూ.. రూ.46.7కోట్లను మార్చినట్టు తేలింది.
ఈడీ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో హైదరాబాద్, కోల్ కత్తా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, చంఢీఘర్, పట్నా, బెంగళూరులు ఉన్నాయి. చెన్నైలోని 8 కంపెనీలకు లింక్ ఉన్న 13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుందని తెలుస్తోంది. ఈ కంపెనీలు కేవలం పేపర్కే పరిమితమయ్యాయని, ఎలాంటి కార్యకలాపాలు జరపడం లేదని గతనెలే పీఎంఓ గుర్తించింది. ఈ షెల్ కంపెనీలను ఇతర కంపెనీలు పన్నుల ఎగవేతకు, మనీ లాండరింగ్ కు ఉపయోగిస్తున్నారని పీఎంఓ తేల్చింది. బ్లాక్ మనీ వ్యతిరేకంగా ప్రధాని మోదీ చేస్తున్న పోరాటంలో వీటిపై దాడులు జరపడం అతిపెద్ద సవాళ్లేనని అధికార వర్గాలంటున్నాయి. ఈ దాడుల్లో భాగంగానే షెల్ కంపెనీలు , వాటి డైరెక్టర్ల డేటా బేస్ ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెవెన్యూ కార్యదర్శి, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి జాయింట్ గా ఈ టాస్క్ ఫోర్స్ నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లలో 1155 షెల్ కంపెనీలను తొలగించారని, వీటితో మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న 22వేలకు పైగా లబ్దిదారులను గుర్తించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్ మనీపై పోరాటాన్ని ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, ఐటీ, సంబంధిత ఏజెన్సీల ద్వారా దాడులు నిర్వహించి అవినీతిని వెలికి తీస్తున్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈ కంపెనీల ద్వారా 550 మంది రూ.3900 కోట్లు నగదును మనీ లాండరింగ్ పాల్పడినట్టు తెలిసింది. వీటిని నిగ్గుతేల్చడానికే ప్రభుత్వం నేడు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహిస్తోంది. కాగ, రద్దయిన నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి ఇతర దేశాల్లో ఉన్న భారతీయులకు ఇచ్చిన అవకాశం కూడా నిన్నటితోనే(మార్చి 31) ముగిసింది.
Advertisement
Advertisement