ఆ అధికారాలు ప్రధానికి కూడా లేవు
స్వాతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ అదృశ్య ఘటనకు సంబంధించిన ఫైళ్లలోని ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ప్రధాని మంత్రి కార్యాలయం తేల్చిచెప్పింది. ప్రధానికి కూడా దానిని బహిర్గతం చేసే అధికారాలు లేవని సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సమాధాన మిచ్చింది. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఐటీ ఉద్యోగి శ్రీజిత్ పనికార్ 'మిషన్ నేతాజీ' పేరిట జరుగుతున్న పరిశోధన బృంద సభ్యుడు. ఈయన నేతాజీ అదృశ్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించే ప్రత్యేక అధికారాలు ప్రధానికి ఉన్నాయా అని సదరు దరఖాస్తులో ప్రశ్నించారు.
ఆ దస్తావేజుల నఖలు తమకు పంపించాలని కూడా కోరారు. ఈ వివరాలపై మొత్తం ఎన్ని ఫైల్స్ ఉన్నాయని ప్రశ్నించారు. అయితే, మొత్తం 41 ఉన్నాయని సెక్షన్ 8(1) (a), 8(2) ఆర్టీఐ 2005 చట్టం ప్రకారం అందులోని ఐదు ఫైళ్లలోని వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొంది. పబ్లిక్ రికార్డ్స్ నిబంధనలు -1997 కూడా కొన్ని ఫైల్స్ వివరాలను యథేచ్చగా వెల్లడించే అధికారం ప్రధానికి ఇవ్వలేదని సమాధానమిచ్చింది. గతంలో ఢిల్లీకి చెందిన ఆర్టీఐ ఉద్యమకారుడు సుభాష్ అగర్వాల్ దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి సమాధానమిచ్చింది. పొరుగుదేశాలతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉన్నందున వాటి వివరాలు వెల్లడించలేమని పేర్కొంది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, పొరుగు దేశాలతో ఉన్న శాస్త్రీయ,సాంకేతిక, ఆర్థిక సంబంధాల దృష్ట్యా వాటిని బహిర్గతం చేయడం సాధ్యం కాదని పీఎంవో తెలిపింది.