విజయ్ మాల్యాకు మరో భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగులబోతుంది. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు ఆయనపై తాజాగా మరో ఛార్జ్‌షీటు ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.6,027 కోట్ల రుణాల నుంచి పెద్ద మొత్తంలో నిధులను షెల్ కంపెనీలకు తరలించినట్టు దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు విజయ్ మాల్యాపై ఛార్జ్‌షీటుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి ఏడు దేశాల షెల్ కంపెనీలకు ఈ నిధులను మరలించినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. యూకే నుంచి మాల్యాను భారత్‌కు రప్పించే కేసుకు తమ ఈ ఆధారాలు మరింత బలోపేతం చేయనున్నాయని సీబీఐ, ఈడీ చెప్పాయి. తొలుత ఐడీబీఐ బ్యాంకుకు చెందిన రూ.900 కోట్ల రుణాల విషయంలో తొలి ఛార్జ్‌షీటును మాల్యాకు వ్యతిరేకంగా ఏజెన్సీలు నమోదుచేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఫైల్ చేయబోతున్న ఛార్జ్‌షీటుతో మాల్యాను మరింత ఉచ్చులో కూరుకుపోనున్నారు. మాల్యాను రప్పించడానికి ఈ ఛార్జ్‌షీటు ఎంతో సహకరిస్తుందని దర్యాప్తు సంస్థలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ఆరోపణలపై తాను వివరణ ఇవ్వలేనని, కానీ ఉద్దేశ్యపూర్వకంగా చేసిన ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నట్టు యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా అన్నారు. రెండో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు నమోదు చేసే ప్రక్రియలో తామున్నామని, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు బ్యాంకులు ఇచ్చిన రుణాలను మాల్యా, ఆయన అసోసియేట్స్ భారీ మొత్తంలో షెల్ కంపెనీలకు తరలించినట్టు తమ విచారణలో వెల్లడైనట్టు అధికారులు పేర్కొన్నారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్‌లకు దీనికి సంబంధించి లేఖలు పంపామని, త్వరలోనే పూర్తి వివరాలు తమ చేతులోకి వస్తాయని అధికారులు చెప్పారు. తాజాగా ఫైల్ చేయబోతున్న ఛార్జ్‌షీటును యూకే ప్రాసిక్యూటర్లకు కూడా పంపించనున్నారు. డిసెంబర్‌లో మాల్యా అప్పగింతపై తుది విచారణ జరుగనుంది. ఈ విచారణ కంటే ముందస్తుగానే ఈ ఛార్జ్‌షీటును యూకేకు పంపించనున్నారు.