మాల్యా కోసం లండన్‌లో ఈడీ, సీబీఐ టీం
న్యూఢిల్లీ: బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్‌మాల్యాను తిరిగి భారత్ రప్పించేందుకు అటు సీబీఐ అధికారులు, ఈడీ అధికారులు తమ ప్రయత్నాలు మరింత వేగవంతం చేశారు. ఆయన చేసిన నేరాలకు సంబంధించిన తాజా ఆధారాలతో ఈడీ, సీబీఐ సంయుక్త టీం ప్రస్తుతం లండన్‌లో ఉంది. వాటిని లండన్‌లోని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్)కు సమర్పించనుంది. దీంతోపాటు ఈడీ దాఖలు చేసిన చార్జీషీటు ఫైలును, అందులో పేర్కొన్న ఆరోపణలకు తగిన ఆధారాలను కూడా చూపించనుంది.
దీంతోపాటు స్వయంగా ఈ టీం సీపీఎస్ అధికారులకు మాల్యా కేసుపై సంక్షిప్తంగా వివరించనుంది. నేరాలు చేశాడనే ఆరోపణల కింద తమ దేశంలో ఉన్న ఓ వ్యక్తిని తీసుకెళ్లేందుకు మరో దేశం ఎలాంటి ఆధారాలు చూపించాలో వాటన్నింటిని కూడా ఇప్పుడు సీబీఐ, ఈడీ అధికారులు సిద్ధం చేసుకొని లండన్‌లోని విచారణ అధికారుల ముందు ఉంచనున్నారు. 'క్రౌన్ ప్రాసీక్యుషన్ సర్వీస్(సీపీఎస్) అధికారులకు భారత విచారణ అధికారులు ఈడీ చార్జీషీటును, అందులోని వివరాలను, ఆధారాలను వివరించనున్నారు. అలాగే, కొన్ని చట్టపరమైన అంశాలను కూడా చర్చించనున్నారు' అని అధికారులు తెలిపారు.