కదులుతున్న ‘అగస్టా’డొంక | AgustaWestland chopper scam: CBI-MoD team to attend ... | Sakshi
Sakshi News home page

కదులుతున్న ‘అగస్టా’డొంక

Published Mon, Jul 14 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

కదులుతున్న ‘అగస్టా’డొంక

కదులుతున్న ‘అగస్టా’డొంక

గత ఎన్డీఏ సర్కారు నిర్ణయాలను తిరగదోడనున్న సీబీఐ
సీబీఐ ప్రత్యేక డెరైక్టర్‌నూ విచారిస్తామన్న అధికారులు

 
న్యూఢిల్లీ: తీగలాగితే డొంక కదులుతోందన్నట్టుగా ఉంది అగస్టా హెలికాప్టర్ల కేసు విచారణ!  రూ. 3,600 కోట్ల లావాదేవీకి సంబంధించిన ఈ కేసు తాజాగా గత ఎన్డీఏ సర్కారు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఇప్పటికే ముగ్గురు గవర్నర్లు ఎం.కె. నారాయణన్(పశ్చిమబెంగాల్), బీవీ వాంఛూ(గోవా), ఈఎస్‌ఎల్ నరసింహన్(ఏపీ, తెలంగాణ)లను విచారించారు. విచారణ అనంతరం నారాయణ, వాంఛూలు పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, గవర్నర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా 2003లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ప్రాథమిక నిర్ణయాలను కూడా విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఎన్డీఏ హయాంలో 2003లో జరిగిన అత్యున్నతాధికారుల సమావేశంలో హెలికాప్టర్లు ప్రయాణించే గరిష్ట ఎత్తును 6,000 మీటర్ల నుంచి 4,500 మీటర్లకు తగ్గించాలని, హెలికాప్టర్ల కొనుగోలు కోసం 1970లలో రూపొందించిన నిబంధనలను సైతం మార్చాలని, పోటీ పెరిగేలా చూడాలని ప్రాథమికంగా నిర్ణయించిన విషయాన్ని గవర్నర్లు సీబీఐ అధికారులకు తెలిపారు. దీని ఆధారంగా 2005లో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. గవర్నర్లు చెప్పిన సమాచారాన్ని నిర్ధారించుకునేందుకుగాను ఎన్డీఏ ప్రభుత్వం 2003లో నిర్వహించిన భేటీలను పూర్తిగా విచారిస్తామని, సమావేశాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ప్రతి విషయాన్నీ కూలంకషంగా విచారిస్తామని అధికారులు తెలిపారు.

సీబీఐ ప్రత్యేక డెరైక్టర్ అనిల్ కుమార్ సిన్హా వాంగ్మూలాన్నీ నమోదు చేసే అవకాశం కొట్టిపారేయలేమన్నారు.  సిన్హా అప్పట్లో(2003) ప్రత్యేక భద్రతా దళానికి(ఎస్పీజీ) ఐజీగా ఉన్నారని, ఈ బృందమే ప్రధాని భద్రతా బాధ్యతలను చూసేదని పేర్కొన్నారు. మరోపక్క, అప్పటి వైమానికి దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ శ్రీనివాసపురం కృష్ణస్వామిని కూడా విచారించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  వీవీఐపీల హెలికాప్టర్ల నిర్వహణను భారత వైమానిక దళమే నిర్వహించిందని, ఈ క్రమంలో ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కృష్ణస్వామికి ఓ లేఖ అందిందని, వాస్తవిక దృక్పథంతో హెలికాప్టర్ల కొనుగోలులో పోటీని పెంచాలని ఈ లేఖలో పేర్కొన్నట్టు తెలిసిందని అధికారుల తెలిపారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement