సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన నీటి వాటాను నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని విమర్శించారు. కశ్మీర్, పంజాబ్‌లలో ప్రాజెక్టులు కట్టి పాక్‌కు నీటి వాటాను తగ్గించాలని 2016లోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. గతంలోనే ఈ నిర్ణయం తీసుకుంటే.. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనే పాక్‌కు నీటివాటాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాక్‌పై దేశ ప్రజలకున్న వ్యతిరేకతను తమకు సానుకూలంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అహ్మద్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు విషయమేమిటంటే!!
ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని అందుకే తీవ్రవాదులు పేట్రేగిపోతున్నారని భారత్ ఆరోపిస్తోంది. దీంతో సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాక్‌కు వెళ్తున్న నీటి వాటాను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని జల వనరుల మంత్రి నితిన్ గడ్కారీ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే 6 సంవత్సరాలు పట్టొచ్చని, నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి అప్పటిలోగా 100 మీటర్ల ఎత్తయిన డ్యామ్‌లను నిర్మిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో 1960 నాటి ఒప్పందం ఉల్లంఘనకు గురవదని, మన దేశ ప్రజలకు దక్కాల్సిన న్యాయబద్ధ హక్కుల్ని కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు వెళ్తున్న మన నీటిని నిలిపివేసి కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు సరఫరా చేయాలని యోచిస్తున్నామని తెలిపిన విషయం తెలిసిందే. (పాక్‌పై జలఖడ్గం)
Comments
Please login to add a commentAdd a comment