అధికార పార్టీలో చీలిక తప్పదా?
తమిళనాడు రాష్ట్ర రాజకీయ భవితవ్యంపై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు రాష్ట్ర రాజకీయ భవితవ్యంపై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళ చెప్పినట్లుగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేయరని, అలాంటి పరిస్థితి లేదని అన్నారు. దాంతో ఆ పార్టీలో చీలిక తప్పదని ఆయన తేల్చిచెప్పారు. ఇక తమిళనాడు ప్రజలు ఆమోదించే స్థాయిలో బీజేపీలో రాష్ట్రస్థాయి నాయకుడు ఇప్పటికిప్పుడు ఎవరూ లేరని కూడా ఆయన అన్నారు. అందువల్ల రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంను ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే, పన్నీర్ సెల్వమే ప్రతిసారీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలని మరో సీనియర్ మంత్రి ప్రశ్నించారు. కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పన్నీర్‌కు మద్దతు పలకడంతో ఆయనే సీఎం అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను బీజేపీ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం చాలావరకు చెన్నైలోనే ఉన్నారు. అక్కడి పార్టీ నాయకులతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
ఇక డీఎంకే మాత్రం ఇప్పటికిప్పుడు అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి, అధికారం చేపట్టే ఉద్దేశంలో ఉన్నట్లు కనిపించడం లేదు. కొంతమంది అధికార, అనధికార ప్రముఖులు ఇంతకుముందే, జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ అవకాశాల గురించి కరుణానిధి, స్టాలిన్‌ల వద్ద ప్రస్తావించగా, దొడ్డిదారిలో అధికారాన్ని చేపట్టడం అనవసరమని, ఒకవేళ ప్రభుత్వం నిలబడలేని పరిస్థితి వస్తే.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి అప్పుడే విజయం సాధించి ప్రజాక్షేత్రం నుంచే అధికార పగ్గాలు చేపట్టాలని వాళ్లు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడులో సమీప భవిష్యత్తులో మధ్యంతర ఎన్నికలు వస్తాయా, లేక ఇదే ప్రభుత్వం చివరివరకు కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.