![Air India Flight Kanishka blast three decades ago - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/23/kanishka-bombing1.jpg.webp?itok=0TNxqELZ)
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఖలిస్థాన్ టెర్రరిస్ట్, 1986లో జరిగిన పంజాబ్ మంత్రి మలికియత్ సింగ్ సిద్ధూ హత్య కేసులో దోషి జస్పాల్ అత్వాల్ భారత్‌కు ఎలా వచ్చారు? భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ ట్రూడోతో ఈ నెల 20వ తేదీన ఎలా ఫొటో దిగారు? నగరంలోని కెనడా హైకమిషన్ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో దంపతుల గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ఆయన్ని ఎందుకు ఆహ్వానించారు? అన్న ప్రశ్నలతో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఉరుకులు పరుగులు తీస్తున్నాయి.
ప్రస్తుతం బ్రిటిష్ కొలంబియాలో వ్యాపారస్థుడిగా స్థిరపడిన జస్పాల్ అత్వాల్‌తోపాటు మరో 225 మందిపై భారత్‌కు రావడంపైనున్న ఆంక్షలను 2015లో ప్రధాని కార్యాలయం తొలగించినట్లు 2016లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సిఫార్సు మేరకు కెనడా పర్యటనను ముగించుకొని వచ్చిన నరేంద్ర మోదీ ‘ట్రావెల్ బ్లాక్‌లిస్ట్’ నుంచి వీరి పేర్లు తొలగించినట్లు పార్లమెంట్‌కు ఇచ్చిన వివరణలో ఉందని తెల్సింది.
ఖలిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నందున భారత్ పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ దంపతులను నరేంద్ర మోదీ పెద్దగా పట్టించుకోవడం లేదని ఇటు అధికార వర్గాలు, అటు బీజేపీ వర్గాలు చెబుతూ వచ్చాయి. కెనడా ప్రధాని పర్యటన సందర్భంగా గుర్తు రావాల్సిన మరో ముఖ్యమైన అంశాన్ని మర్చిపోయారు. 1985, జూన్ 23వ తేదీన కెనడా నుంచి భారత్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ‘కనిష్క’ విమానాన్ని ఖలిస్థాన్ ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చివేయగా 329 మంది మరణించిన విషయం. అంతర్జాతీయ సిక్కు యువజన సమాఖ్యకు చెందిన ఉగ్రవాదులే కెనడాలో ఆ విమానంలో బాంబు పెట్టారు. అదే యువజన సంఘానికి చెందిన వ్యక్తి ఇప్పటి జస్పాల్ అత్వాల్.
మరణించిన 329 మందిలో 280 మంది కెనడా పౌరులు లేదా శాశ్వత కెనడా రెసిడెన్సీ కలిగిన పౌరులు మరణించినప్పటికీ కెనడాలో జరిగిన పెద్ద విమానం పేలుడు ప్రమాదంగాగానీ లేదా భారత్–కెనడా విమానం పేలుడు ప్రమాదంగాగానీ గుర్తించడానికి కెనడా ప్రభుత్వం నిరాకరిస్తూ వచ్చింది. చివరకు భారత్ అంతర్జాతీయ వేదికలపై విమానం పేల్చివేయడాన్ని ‘కెనడా 9–11’ గా వ్యవహరిస్తూ రావడం వల్ల దాన్ని పెద్ద దుర్ఘటనగా గుర్తించింది. ఖలిస్థాన్ ఉద్యమం పట్ల చూపిస్తున్న సానుకూల వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment