బరిలో ములాయం రెండో కోడలు
లక్నో: యూపీ ఎన్నికల బరిలో సమాజ్‌వాదీ పార్టీ చాలా పకడ్బందీగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. యాదవ్ కుటుంబం నుంచి మరో అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. లక్నోలోని కంటోన్మెంట్ ప్రాంతం నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై.. ములాయం రెండో కోడలు అపర్ణ యాదవ్ (అఖిలేశ్ చిన్నమ్మ కొడుకు ప్రతీక్ భార్య)ను పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి రీటా బహుగుణ కాంగ్రెస్ తరపున విజయం సాధించారు.
ఈ నియోజకవర్గంలో కొంతకాలంగా ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో అపర్ణ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూపీ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రచారం మంగళవారం ప్రారంభించనున్నారు. సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుంచి యాదవ్ ప్రచారం మొదలుకానుంది. కాగా, యూపీలో మూడో విడత ఎన్నికలకు మంగళవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారభం కానుంది.