మావాడు.. పనికిమాలిన సీఎం: ఎమ్మెల్సీ
''ఇప్పుడున్నది అసలు రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పనికిమాలిన ముఖ్యమంత్రి.. వెంటనే ఆయనను మార్చేసి అనుభవజ్ఞుడైన, సమర్థుడైన కొత్త ముఖ్యమంత్రిని పెట్టండి. లేకపోతే పార్టీ మనుగడే అనుమానంలో పడుతుంది'' అని ఓ ఎమ్మెల్సీ తమ సొంత పార్టీ ముఖ్యమంత్రి గురించి వ్యాఖ్యానించారు. ఆ ఎమ్మెల్సీ పేరు.. దేవేంద్ర ప్రతాప్ సింగ్. ఆయన చెప్పిన ముఖ్యమంత్రి.. అఖిలేష్ యాదవ్. ఆయన సూచన చేసినది.. సాక్షాత్తు పార్టీ పెద్దాయన ములాయం సింగ్ యాదవ్‌కి.
ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేసే అన్ని సంస్థలలోను అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని దేవేంద్ర ప్రతాప్ ఇటీవలే ఆరోపించారు. యూపీపీఎస్‌సీ గత రెండేళ్లలో చేసిన నియామకాలు అన్నింటి మీదా సీబీఐ దర్యాప్తు చేయించాలని జూలై నెలలో ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ కూడా రాశారు.
నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న తర్వాత ఇప్పటికీ అఖిలేష్ యాదవ్ ఒక గుర్తింపు కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారని, చాలా సందర్భాల్లో ఆయన పనితీరు సరిగా ఉండట్లేదని సింగ్ తాజాగా చెప్పారు. యూపీ చరిత్రలోనే అత్యంత బలహీనమైన, అసమర్థ ముఖ్యమంత్రిగా ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. ఉత్తరప్రదేవ్ రాష్ట్రానికి అఖిలేష్ ఓ బండలా తగులుకున్నారని విమర్శించారు. అందువల్ల పార్టీ బతికుండాలంటే వెంటనే సీఎంను మార్చేయాల్సిందిగా నేతాజీని (ములాయం) కోరతున్నానని ఆయన విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు.