
ఆరెస్సెస్‌ను ఐఎస్‌తో పోల్చిన కాంగ్రెస్
చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి ఆరెస్సెస్‌ను ఉగ్రవాద సంస్థ ఐఎస్‌తో పోల్చారు. ఉగ్ర సంస్థ ఐఎస్ తరహాలో ఆరెస్సెస్ కూడా తమ భావజాలాన్ని వ్యతిరేకించే వారిని ద్వేషిస్తుందని ఆరోపించారు. మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను ప్రస్తావిస్తూ దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను అళగిరి సమర్ధించడం గమనార్హం.
కమల్ హాసన్ ప్రకటనతో తాను నూరు శాతం కాదు..వేయి శాతం ఏకీభవిస్తానని చెప్పుకొచ్చారు. తమ సిద్ధాంతంతో విభేదించేవారిని తుదముట్టించాలని అరబ్ దేశాల్లో ఐఎస్ తలపోసినట్టే భారత్‌లో ఆరెస్సెస్, జనసంఘ్, హిందూ మహాసభలు భావిస్తాయని అన్నారు. అరబ్ దేశాల్లో తమ భావజాలంతో ఏకీభవించని వారు ముస్లింలే అయినా వారిని తుదముట్టించాలని అక్కడి అతివాదులు భావిస్తారని వ్యాఖ్యానించారు. కాగా అంతకుముందు తమిళనాడులోని అరవక్కురుచ్చిలో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్ హాసన్ స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది హిందువేనని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.