సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఏ నగరానికెళ్లినా, ఎక్కడో అక్కడ ఆడపిల్లలను అల్లరిపెడుతూ ఆకతాయులు అగుపడుతూనే ఉంటారు. రైల్లే స్టేషన్లలో, బస్టాండుల్లోనే కాకుండా మాల్స్ ముందు, వీధి చివరన మాటువేసి అల్లరి పెట్టే కొత్త తరం ఆకతాయులు తయారయ్యారు. వారిలో ఆడపిల్లలను కట్టు బొట్టు దగ్గరి నుంచి కామెంట్ చేసి ఇబ్బంది పెట్టడమే కాకుండా కనుగీటి ఏడిపించే ముదురులు కూడా ఉంటున్నారు. అయితే రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో వీరి ఆటలు ఇప్పుడు అంతగా సాగడం లేదు.
ఆడపిల్లలను ఏడిపిస్తున్నారని ఏ మాత్రం అనుమానం వచ్చినా నీలి రంగు దుస్తుల్లో, నెత్తిన హెలిమెట్లతో బైక్‌పై ఇద్దరు మహిళా పోలీసులు కన్నుమూసి తెరిచే లోపల కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నారు. ఏడిపించే ఆకతాయులు ఎవరైనా, ఎంతటి వారైనా సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి సముచిత రీతిన సత్కరిస్తున్నారు. ఏడిపిస్తున్న తీరు, స్థాయినిబట్టి ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. ఆకతాయులు అల్లరి చేస్తూ కనిపిస్తే రోడ్డుపై జిగ్‌జాగ్‌గా కూడా బైకులు నడుపుతూ వెళ్లి అమ్మాయిలకు రక్షణగా నిలబడుతున్నారు.
రౌడీలను, ఆకతాయిలను, నేరస్థులను సివిల్ దుస్తుల్లో చూసినప్పుడు తమకూ భయం వేసేదని, ఒక్కసారి యూనిఫామ్ చేసుకున్నాక తమకు భయం అంటూ లేకుండా పోయిందని నిర్మలా, ప్రమీలా అనే మహిళా పోలీసులు తెలిపారు. కొత్తలో 30 రోజుల్లోనే 256 టీజింగ్ కేసులను నమోదు చేశామని ఇప్పుడు వారి సంఖ్య భారీగా తగ్గిపోయిందని వారు తెలిపారు. ముఖ్యంగా ఒక్కసారి పట్టుబడిన వారు మళ్లీ అల్లరి చేయక పోవడం విశేషమని వారు చెప్పారు. నగర వీధుల్లో తిరుగుతూ ఆడపిల్లలను అల్లరిపెట్టే ఆకతాయులపై చర్య తీసుకోవడం కోసమే ఈ మహిళా పోలీసు బైకర్లు ఉన్నారు. నిర్మలా, ప్రమీలాను కలుపుకొని నగరంలో మొత్తం 52 మంది మహిళా బైకర్లు ఉన్నారు. అయితే వీరి సంఖ్య సరిపోవడం లేదని వీరి సంఖ్యను వందకు పెంచాలనుకుంటున్నామని అడిషనల్ పోలీసు కమిషనరల్ గౌరవ్ శ్రీవాత్సవ తెలిపారు.
ప్రస్తుతం ఇలాంటి మహిళా దళాలు దేశంలో ఢిల్లీ, జైపూర్‌లతోపాటు ఉధయ్‌పూర్ నగరాల్లో ఏర్పాటు చేశారు. ఢిల్లీలో రఫ్తార్ స్క్వాడ్ పేరిట ఇలాంటి మహిళా దళాన్ని 2017, మే నెలలో ఏర్పాటు చేశారు. వారి వద్ద తుపాకులు, స్టెన్‌గన్లతోపాటు పెప్పర్ స్ప్రేలు ఉంటాయి. ప్రస్తుత జైపూర్ మహిళా పోలీసుల వద్ద లాఠీలు మాత్రమే ఉన్నాయి. పోలీసుల్లోకి మహిళలు రావడానికి ఇప్పటికీ అంతగా ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యకరమని పోలీసు అధికారి శ్రీవాత్సవ అన్నారు. పోలీసు ఉద్యోగాల్లో కూడా మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు ఉండగా పది శాతానికి మించి మహిళలు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో మహిళల పట్ల లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా పోలీసుల ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన చెప్పారు. నేడు భారత్‌లో ప్రతి 13 నిమిషాలకు ఒక రేప్ జరుగుతోంది. 2016లో రోజుకు ఆరుగురు మహిళలపై గ్యాంగ్ రేప్‌లు జరిగాయి. కట్నం కోసం ప్రతి 69 నిమిషాలకు ఓ పెళ్లి కూతురు హత్యకు గురవుతున్నారు. 2012లో ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య జరిగిన తర్వాత కొన్ని కఠిన చట్టాలను తీసుకొచ్చినా, సాధ్యమైనంత వరకు త్వరిత గతిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై అత్యాచారాలు ఆశించినంతగా తగ్గడం లేదు. ఆడపిల్లల అల్లరి కేసుల్లో ఆకతాయిలను అరెస్ట్ చేసి కేసులు పెట్టడం కన్నా వారికి కౌన్సిలింగ్ క్లాసులను నిర్వహిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment