ఎన్నికలకు ‘గ్రామీణ’ అస్త్రం! | Allocate as much as possible all major schemes | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు ‘గ్రామీణ’ అస్త్రం!

Published Fri, Feb 2 2018 2:35 AM | Last Updated on Mon, Aug 20 2018 4:55 PM

Allocate as much as possible all major schemes - Sakshi

గోవర్ధనమంతటి పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తిపట్టి గోకులవాసులందరికీ రక్షణ కల్పించాడు చిన్నికృష్ణుడు. అలాగే జైట్లీ కూడా అనేకానేక పరిమితుల మధ్యే, ప్రధాన పథకాలన్నింటికీ వీలైనంత భారీ కేటాయింపులు చేస్తూ కత్తిమీద సామును విజయవంతంగా పూర్తి చేశారు... 

రానున్న అసెంబ్లీ, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా గ్రామీణ ఓటర్లకు గాలం వేసేందుకు మోదీ సర్కారు గట్టిగానే కసరత్తు చేసింది. నోట్ల రద్దుతో పాటు కరువుతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న గ్రామీణ భారతంపై నిధుల వర్షం కురిపించింది. పల్లెవాసులకు మౌలిక సదుపాయాలను భారీగా పెంచేందుకు వీలుగా పలు కీలక పథకాలకు జైట్లీ తన చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్‌(ఎన్‌డీఏ ప్రస్తుత టర్మ్‌)లో పెద్దపీట వేశారు. ఉపాధి హామీకి నిధుల పెంపుతో పాటు పల్లెల్లో డిజిటల్‌ విప్లవమే లక్ష్యమని జైట్లీ ప్రకటించారు. 5 లక్షల వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటు, గ్రామాల్లో పేదలకు మరిన్ని ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు, వచ్చే ఏడాది మార్చికల్లా కోటి పక్కా ఇళ్ల నిర్మాణం వంటివన్నీ పూర్తి చేస్తామని వెల్లడించారు. మొత్తంమీద ఈ ఎన్నికల బడ్జెట్‌లో ‘గ్రామీణ’రాగాన్ని ఆలపించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

‘ఉపాధి’కి దన్ను..
2018–19 బడ్జెట్‌ కేటాయింపు
రూ.55,000 కోట్లు(14.5% పెంపు)
2017–18 బడ్జెట్‌ కేటాయింపు: రూ.48,000 కోట్లు
►గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు కీలకంగా మారిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి మోదీ ప్రభుత్వం ఈసారీ నిధులను భారీగా విదిల్చింది.
►2017–18లో బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే సవరించిన అంచనాలు రూ.55,000 కోట్లకు పెంచడం ఈ పథకం అమలు జోరుకు నిదర్శనం.
►వర్షాలపైనే ఆధారపడిన ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతల ఏర్పాటు వంటి లక్ష్యాలను మోదీ సర్కారు పూర్తిచేసింది.
ఈ ఏడాది మార్చి చివరి నాటికి మరో 5 లక్షల వ్యవసాయ చెరువుల తవ్వకాన్ని పూర్తి చేయనున్నట్లు కేంద్రం చెబుతోంది.అదేవిధంగా ఈ పథకం కింద దాదాపు 22 లక్షల సహజ వనరుల నిర్వహణ(ఎన్‌ఆర్‌ఎం–చెక్‌ డ్యామ్‌లు, ఇతరత్రా నీటి పరిరక్షణ) పనులు జరుగుతు న్నాయి. దీనివల్ల 47.1 లక్షల హెక్టార్లకు లబ్ధి చేకూరడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకత, ఆదాయాలు పెరిగేందుకు దోహదం చేయనుందని కేంద్రం పేర్కొంది. ఈ స్కీమ్‌లో పూర్తయిన దాదాపు 3.29 కోట్ల పనులకు జియో ట్యాగింగ్‌ను చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2018 జనవరి 15 నాటికి 3.15 కోట్ల ఆస్తులకు పూర్తి చేశారు.కొత్తగా 60 లక్షల పనులను మొదలు పెట్టనున్నారు. 10 లక్షల ఆస్తుల నిర్మాణం, 230 కోట్ల పనిదినాలను సృష్టించడం వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్నారు.

‘స్వచ్ఛ భారత్‌’ జోరు..
2018–19 కేటాయింపులు
రూ.15,343 కోట్లు (10% పెంపు)
2017–18 కేటాయింపులు: రూ.13,948 కోట్లు
►2019 అక్టోబర్‌ 2 నాటికి(గాంధీ జయంతి) దేశవ్యాప్తంగా అన్ని కుటుంబా లకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్‌ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం. ∙ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ 6 కోట్ల వ్యక్తిగత టాయిలెట్ల నిర్మాణం పూర్తయిందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 1.88 కోట్లను నిర్మించే లక్ష్యంతో బడ్జెట్‌ను పెంచినట్లు జైట్లీ పేర్కొన్నారు.

►ఈ ఏడాది జనవరి 1 నాటికి 284 జిల్లాల్లో మొత్తం 1,32,038 గ్రామ పంచాయతీలు, 3,02,445 గ్రామాలను బహిరంగ మరుగుదొడ్ల రహితం(ఓడీఎఫ్‌)గా ప్రకటించారు. ఇక 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను(సిక్కిం, హిమాచల్, అరుణాచల్, డామన్‌ అండ్‌ డయ్యూ, కేరళ, ఉత్తరాఖండ్, హరియాణా, గుజరాత్‌) ఓడీఎఫ్‌గా ప్రకటించారు. మొత్తం ఓడీఎఫ్‌ ప్రాంతాల సంఖ్య 8,02,054కు చేరింది. కాగా, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్‌ పథకం కోసం తాజా బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించారు.

ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ..
2018–19 కేటాయింపులు రూ.7,000 కోట్లు (15% పెంపు)
2017–18 కేటాయింపులు
రూ. 6,050 కోట్లు

దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని గ్రామీణ ప్రాంతాలకూ  తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది అరకొర నీటి సదుపాయం ఉన్న 60,000 ప్రాంతాలను,  తాగునీరు అందని 9,000 ప్రాంతాలను ఈ పథకం కిందికి తీసుకురావాలని నిర్ణయించారు.

గ్రామీణ టెలిఫోనీ..
2018–19 కేటాయింపులు
రూ.10,000 కోట్లు(14% తగ్గింపు)
2017–18 కేటాయింపులు రూ.11,636 కోట్లు(322% పెంపు)
►దేశంలో టెలికం మౌలిక వసతులను పెంచడమే ఈ పథకం లక్ష్యం. ఇందులో ప్రధానంగా భారత్‌ నెట్‌ కార్యక్రమంలో భాగంగా 2019 మార్చి నాటికి దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీని లక్ష్యంగా పెట్టుకున్నారు. ∙భారత్‌ నెట్‌ ఫేజ్‌–1లో ఇప్పటివరకూ లక్ష గ్రామ పంచాయతీలకు ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించామని, తాజాగా  గ్రామీణ భారత్‌లో 5 కోట్ల మందికి  బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు  5 లక్షల వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నామని  జైట్లీ ప్రకటించారు. 

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)..
2018–19 కేటాయింపులు: రూ.21,000 కోట్లు(8.7 శాతం తగ్గింపు)
2017–18 కేటాయింపులు: రూ. 23,000 కోట్లు

ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై)..
2018–19 కేటాయింపులు
రూ.19,000 కోట్లు(పెంపు లేదు)
2017–18 కేటాయింపులు
రూ. 19,000 కోట్లు
►మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకం ఇది. 2011–14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73 కిలోమీటర్లు కాగా, 2016–17లో ఇది 133 కిలోమీటర్లకు పెరిగిందని జైట్లీ పేర్కొన్నారు.

►గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించడానికి మరో 57,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. తద్వారా అర్హతగల గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం అనుసంధానం లక్ష్యం. ప్రస్తుతం 82 శాతం అనుసంధానం పూర్తయింది. 2019 మార్చికల్లా 100 శాతం లక్ష్యాన్ని సాధించనున్నట్లు జైట్లీ చెప్పారు.

►2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2018 జనవరి 15 నాటికి) 25 వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు. 6,400 ప్రాంతాలను అనుసంధానించగలిగారు.

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన..
2018–19 కేటాయింపులు
రూ.11,485 కోట్లు(8 శాతం పెంపు)
2017–18 కేటాయింపులు రూ.10,635 కోట్లు

►విద్యుత్‌ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు.. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్‌) ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ లక్ష్యం(సమగ్ర విద్యుదీకరణ స్కీమ్స్‌–ఐపీడీఎస్‌). 2018 మే 1 కల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్‌ సౌకర్యం కల్పించనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.

►ఐపీడీఎస్‌లో భాగంగా సౌభాగ్య ఘర్‌ యోజన(ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు) కోసం రూ.3,700 కోట్లను, ఫీడర్లను వేరు చేసేందుకు గాను(33/11 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, హై–లో టెన్షన్‌ విద్యుల్‌ లైన్ల నిర్మాణం వంటివి) రూ.4,935 కోట్లను కేటాయించారు. గ్రామాల్లో కొత్తగా 175 లక్షల బీపీఎల్‌ కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం.

పర్యాటకంపై ప్రత్యేక దృష్టి 
న్యూఢిల్లీ: దేశంలోని 10 ప్రముఖమైన చరిత్రాత్మక, సాంప్రదాయిక పర్యాటక కేంద్రాలను ‘ఐకానిక్‌ టూరిజం డెస్టినేషన్స్‌’గా మార్చేందుకు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నామని జైట్లీ పేర్కొన్నారు. దీంతోపాటుగా భారత పురావస్తు శాఖ ప్రతిపాదించిన 100 ఆదర్శ కట్టడాల వద్ద పర్యాటకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నేషనల్‌ హెరిటేజ్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ అగ్‌మెంటేషన్‌ యోజన (హృదయ్‌)లో భాగంగా ప్రాచీన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రోప్‌వేలు నిర్మించటం.. ఆయా ప్రాంతాలకు రైల్వే సదుపాయం కల్పించటం, సమీప రైల్వే స్టేషన్ల అభివృద్ధి వంటివి చేపట్టామన్నారు.  

పౌష్టికాహార మిషన్‌కు రూ.3 వేల కోట్లు 
న్యూఢిల్లీ: జాతీయ పౌష్టికాహార మిషన్‌(ఎన్‌ఎన్‌ఎం)కు ఈ బడ్జెట్‌లో కేటాయింపుల్ని మూడు రెట్లు పెంచారు. గతేడాది రూ.950 కోట్లు కేటాయించగా, ఈసారి  రూ.3,000 కోట్లకు పెంచారు. రాబోయే మూడేళ్లలో(2017–20) ఎన్‌ఎన్‌ఎంకు రూ.9,046 కేటాయించాలన్న కేంద్ర కేబినెట్‌ నిర్ణయం మేరకు బడ్జెట్‌లో తాజా కేటాయింపులు చేశారు. చిన్నారుల్లో పోషకాహారలోపం తదితర సమస్యల్ని నివారించడానికి ఎన్‌ఎన్‌ఎం కృషి చేస్తోంది. ఈ ఏడాది కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్‌లో రూ.24,700 కేటాయించగా.. దీంట్లో రూ.16,334 కోట్లను అంగన్‌వాడీ సేవలకు వినియోగిస్తారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేలు అందించే ప్రధాన్‌మంత్రి మాతృ వందన యోజనకు గతేడాది రూ.2,594 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తం రూ.2,400 కోట్లకు పరిమితమైంది. ‘బేటీ బచావో–బేటీ పడా వో’ పథకానికి ఈసారి రూ.280 కోట్లు కేటాయించారు. గతేడాది ఈ మొత్తం రూ.200 కోట్లు. మహిళల రక్షణకు 2013లో రూ.3,500 కోట్లతో ఏర్పాటు చేసిన నిర్భయ ఫండ్‌ను ఈసారి రూ.500 కోట్లకు పెంచారు. చిన్నారుల్ని రక్షించే సేవలకు ఈసారి రూ.725 కోట్లు ఇవ్వనున్నారు.  

ఢిల్లీకి రూ.790 కోట్లు
న్యూఢిల్లీ: 2018–19 వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి రూ.790 కోట్లు కేటాయించింది. కేంద్ర పన్నుల వాటా పెంచాలని ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసినప్పటికీ ఎలాంటి మార్పూలేదు. ఈ బడ్జెట్‌లో కేంద్ర సాయం రూ.449.99 కోట్లు. ఇది గత బడ్జెట్‌లో 412.98 కోట్లు. 1984 అల్లర్ల బాధిత కుటుంబాల కోసం గత బడ్జెట్‌లో రూ.15 కోట్లివ్వగా ఈసారి రూ.10 కోట్లే కేటాయించింది. కేంద్ర పన్నుల వాటా కింద ఢిల్లీకి రూ.325 కోట్లు కేటాయించింది. 2001–02 నుంచి కేంద్రంలో ప్రభుత్వాలు మారినా ఈ మొత్తం మాత్రం స్థిరంగా ఉంది.  

ప్రజల నుంచి సౌరవిద్యుత్‌ కొనుగోలు
న్యూఢిల్లీ: ప్రజల నుంచి మిగులు సౌరవిద్యుత్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేసేందుకు విధివిధానాలు రూపొందిస్తామన్న ఆర్థిక మంత్రి జైట్లీ ప్రతిపా దనను పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. అయితే సోలార్‌ ఉత్పత్తుల దిగుమతులపై 70 శాతం భద్రతా సుంకం విధిస్తామన్న కేంద్రం ప్రతిపా దనపై మాత్రం ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజల నుంచి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు విధివిధానాలు రూపొందిం చుకునేలా ప్రోత్సహిస్తామని జైట్లీ గురువారం బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోలార్‌ ట్యాంపర్డ్‌ గ్లాస్‌ లేదా సోలార్‌ ప్యానెల్స్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని రద్దుచేస్తామని ఆయన ప్రకటించారు. భారత పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థకు వచ్చే ఏడాదికిగానూ రూ.10,099.41 కోట్ల పెట్టుబడుల్ని ఈ బడ్జెట్‌లో కేటాయించారు. అలాగే భారత సౌర విద్యుత్‌ సంస్థ(ఎస్‌ఈసీఐ)కు వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు తగ్గాయి. 2018–19 కాలానికి ఎస్‌ఈసీఐకి రూ.217.43 కోట్ల పెట్టుబడుల్ని కేటా యించగా.. ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.250.42 కోట్లుగా ఉంది. మరోవైపు సౌర విద్యుత్‌పై జైట్లీ చేసిన ప్రసంగాన్ని స్వాగ తిస్తున్నట్లు ఖైతాన్‌ సంస్థ భాగస్వామి దిబ్యాన్షు తెలిపారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందోనని ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement