ఆన్‌లైన్‌పై ఆంక్షలతో స్వేచ్ఛకు సంకెళ్లు
న్యూఢిల్లీ: భారత్‌లో పత్రికా స్వేచ్ఛ నానాటికి తగ్గిపోతోంది. మీడియాపై దాడులు పెరిగి పోతున్నాయి. 2016, జనవరి నుంచి 2017, ఏప్రిల్ నెల వరకు జర్నలిస్టులపై 54 దాడులు జరిగాయని ‘ది హూట్’ మీడియా వాచ్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. కనీసం మూడు చానెళ్ల ప్రసారాలను నిషేధించారు. 45 ఇంటర్నెట్‌లను మూసేశారు. వ్యక్తులు, గ్రూపులు కలుపుకొని 45 దేశద్రోహం కేసులు నమోదు చేశారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా బుధవారం నాడు ‘ది హూట్’ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ కలిగిన 180 దేశాలతో పోలిస్తే భారత్‌ది 136వ స్థానం. ప్రజల సమాచార హక్కులపై ఆంక్షలు విధించడం, వారికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకుండా చేయడం, ఆన్‌లైన్ స్వేచ్ఛపై ఆంక్షలు అమలు చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛను అరికట్టడం తదితర కారణాల వల్ల ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్‌లో భారత్ స్థానం పడిపోతోంది. 2016, జనవరి నుంచి 2017, ఏప్రిల్ నెల వరకు దేశంలో ఏడుగురు జర్నలిస్టులు దాడుల్లో మరణించారని హూట్ తెలిపింది. జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై ఫిర్యాలుకాని దాడులు ఎన్నో ఉన్నాయని వెల్లడించింది.
జర్నలిస్టులపై జరిగిన దాడుల్లో తొమ్మిది దాడులు పోలీసులు చేసినవి కాగా, ఎనిమిది దాడులు రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు చేసినవి. ఐదు దాడులు ఇసుక, బొగ్గు మాఫియా చేసినవికాగా, నాలుగు మీడియా కవరేజీ అడ్డుకుంటూ ప్రజా గుంపు చేసిన దాడులు. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు సాక్షి టీవీ కేబుల్ ప్రసారాలను నెంబర్ వన్ న్యూస్ చానెల్ ప్రసారాలను నిలిపివేశారు. ఎన్డీటీవీ ప్రసారాలను 24 గంటలు నిషేధించారు. ఒక్క 2016 సంవత్సరంలోనే జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై 40 దేశద్రోహం కేసులు పెట్టారు. మరోపక్క ప్రజల సమాచార హక్కును కూడా నీరుకారుస్తూ వస్తున్నారు.