సానుకూలాంశాలూ ఉన్నాయ్‌ | Also there some benifits on demonetisation | Sakshi
Sakshi News home page

సానుకూలాంశాలూ ఉన్నాయ్‌

Published Fri, Dec 30 2016 2:39 AM | Last Updated on Fri, Sep 28 2018 3:31 PM

సానుకూలాంశాలూ ఉన్నాయ్‌ - Sakshi

సానుకూలాంశాలూ ఉన్నాయ్‌

పెద్ద నోట్ల రద్దుతో ఉన్నట్టుండి వెలుగులోకి వచ్చి బాగా వృద్ధి చెందుతున్న వ్యవస్థేదైనా ఉందీ అంటే అది డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థే. ఇప్పటిదాకా వీసా, మాస్టర్‌ కార్డ్‌లకే పరిమితమై... దేశీ కార్డు ‘రూపే’ను అంతగా పట్టించుకోకున్నా ఇపుడు మాత్రం అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నవంబరు 8 తరవాత రూపే మర్చెంట్‌ టెర్మినళ్ల లావాదేవీలు దాదాపు ఏడు రెట్లు పెరిగి రోజుకు 3 లక్షల నుంచి ఏకంగా 21 లక్షలకు చేరుకున్నాయి. ఆర్‌బీఐ నేతృత్వంలో నడిచే ఈ రిటైల్‌ పేమెంట్‌ వ్యవస్థ... వచ్చే డిసెంబరు నాటికి రోజుకు 50 లక్షల లావాదేవీల్ని ప్రాసెస్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటిదాకా 31.7 కోట్ల రూపే కార్డుల్ని జారీ చేసింది. అయితే దీన్లో దాదాపు 20.5 కోట్ల కార్డులు జన్‌ధన్‌ ఖాతాలకు చెందినవే.

రోజుకు 50 లక్షల లావాదేవీలు నమోదైతేనే మనం తక్కువ నగదున్న వ్యవస్థలోకి మళ్లినట్లనేది ఎన్‌సీపీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.పి.హోతా మాట. అయితే దీనికోసం మరో ఏడాది పడుతుందని ఆయన చెబుతున్నారు. అంతేకాక ఎన్‌సీపీఐ ఆధ్వర్యంలో సాగే యూఎస్‌ఎస్‌డీ (అన్‌స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ సర్వీస్‌ డేటా) లావాదేవీల సంఖ్య కూడా నవంబరు 8 తరవాత రోజుకు 1.5 లక్షల లావాదేవీల నుంచి ఏకంగా 6 లక్షల లావాదేవీలకు చేరింది. ఇక టెక్నాలజీలో ముందంజలో ఉన్న యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా సాగే లావాదేవీల సంఖ్య ఏకంగా రోజుకు 35వేల నుంచి 70 వేలకు చేరింది. ఇప్పటిదాకా 33 బ్యాంకులు ఈ యూపీఐ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చాయి.

కాకపోతే వీటికీ కొన్ని పరిమితులున్నాయి. దేశంలో ఇప్పటికీ చాలాచోట్ల ఇంటర్నెట్‌ లేదు. ఉదాహరణకు జమ్మూకశ్మీర్‌ వంటి ప్రాంతాల్లో ఏ చిన్న గొడవ జరిగినా ముందు ఆపేసేది ఇంటర్నెట్‌నే. మరక్కడ ఇంటర్నెట్‌ లావాదేవీలు సాధ్యమా? పోనీ మొబైల్‌ నెట్‌ అనుకున్నా... నెట్‌వర్క్‌ లేని ప్రాంతాలు నేటికీ అత్యధికం ఉండనే ఉన్నాయి.

పట్టణాల్లోనూ ఈ–పేమెంట్స్‌..
నోట్ల రద్దుతో మెట్రో నగరాలే కాదు! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలూ డిజిటల్‌ పేమెంట్స్‌ దిశగా అడుగులేస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోనూ ఆన్‌లైన్‌ లావాదేవీలు, వ్యాలెట్ల వినియోగం కోసం యాప్స్‌ డౌన్‌లోడ్‌ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ విక్రయాలను పెంచాలంటే విక్రయదారులు కూడా తప్పనిసరిగా డిజిటల్‌ పేమెంట్‌ అవకాశాన్ని కల్పించాల్సిన పరిస్థితి నెలకొందని ఫ్యాషన్‌ పోర్టల్‌ సీక్రెట్‌ డ్రెస్సర్‌ ఫౌండర్‌ డింపుల్‌ మిర్చందాని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సమయంలో పెళ్లిళ్ల సీజన్‌ ఉండటం తమకు కలిసొచ్చిందని.. అక్టోబర్‌తో పోలిస్తే గత నెల రోజుల్లో అమ్మకాలు రెండింతలు పెరిగాయని తెలిపారు. డిజిటల్‌ పేమెంట్స్‌ వినియోగంతో వ్యాపారంలో పారదర్శకత పెరగడంతో పాటూ మరిన్ని ఆన్‌లైన్‌ వ్యాపార అవకాశాలకు వేదికవుతుందని తెలియజేశారు.

స్టార్టప్‌లకూ కాలం కలిసొచ్చింది
స్టార్టప్‌లలో చాలావరకూ నగదు అవసరం లేకుండా ఆన్‌లైన్, కార్డుల ద్వారా లావాదేవీల్ని అనుమతిస్తున్నవే. ఉదాహరణకు మొబైల్‌ వ్యాలెట్‌ సేవలందించే పేటీఎం, మొబిక్విక్‌ వంటి స్టార్టప్స్‌ బాగా లాభపడ్డాయి. జనం ఇబ్బందులు చూసి చాలా మంది చిన్న వర్తకులు, ట్యాక్సీ సంస్థలు ఆన్‌లైన్‌ పేమెంట్‌లను ప్రారంభించినట్లు న్యాయ నిపుణుడు, స్టార్టప్‌ కంపెనీలకు అడ్వైజరీ సేవలందించే సమీర్‌ రస్తోగి చెప్పారు. నగదు రహిత దేశంగా అడుగులేయటంలో ఇది ప్రారంభ దశ మాత్రమేనన్నారు. స్వల్ప కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మీద ప్రభావం పడే మాట వాస్తవమే అయినా.. దీర్ఘకాలంలో మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇది దేశీయ స్టార్టప్స్‌కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశముందని అంచనా వేశారు. అయితే నిధుల సమీకరణ కష్టంగా మారటంతో కొన్ని కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు నిలిపివేశాయి. హెచ్‌ఎన్‌ఐలు, విదేశీ ఇన్వెస్టర్ల ప్రస్తుతం దేశంలో నెలకొన్న నగదు సమస్యపై భవిష్యత్తులో ఏం జరుగుతుందనే డైలమాలో ఉన్నారని, దీంతో నిధుల సమీకరణ నిమిత్తం దేశీయ స్టార్టప్స్‌తో చేసుకున్న ఒప్పందాలను కొద్ది కాలం పాలు నిలిపివేశారని నిపుణులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement