గోరఖ్‌పూర్ ఘటన కొత్తేం కాదు!
గోరఖ్‌పూర్ ఘటన కొత్తేం కాదు!
Published Tue, Aug 15 2017 9:28 AM | Last Updated on Mon, May 28 2018 3:58 PM
న్యూఢిల్లీ: గోరఖ్‌పూర్ పిల్లల మరణాల అంశం కొత్తేం కాదని, ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూర్‌లో ఉన్న ఆయన సోమవారం మీడియా మాట్లాడుతూ... చిన్నారుల మరణాలు ఘోర తప్పిదమేనని పేర్కొన్నారు. ఇక రాజీనామాల డిమాండ్ పై కూడా ఆయన స్పందించారు.
"గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయటమే వాళ్లకు పనిగా మారిపోయిందని" అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే ఘటన వెనుక నిర్లక్ష్యం ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ముఖ్యమంత్రి కాలపరిమితితో కూడిన విచారణ కమిటీని నియమించారు. విచారణ పూర్తయి నివేదిక వస్తేనే కానీ ఎవరి పైనా పార్టీ చర్యలు తీసుకోదని, నేరం రుజువైతే ఎంత వారినైనా వదిలే ప్రసక్తే లేదని షా తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించే అంశంపై స్పందిస్తూ... పిల్లల మరణం ప్రతీ ఒక్కరినీ కదిలించి వేసింది. కానీ, జన్మాష్టమి ప్రభుత్వానికి సంబంధించిన పండుగ కాదని ఆయన వివరణ ఇచ్చారు.
నోటీసులు పంపినా నిర్లక్ష్యం
బాబా రాఘవ దాస్ ఆస్పత్రిలో ఇప్పటిదాకా 72 మంది చిన్నారులు చనిపోయారు. వీరిలో 23 మంది ఆక్సిజన్ అందకే చనిపోయారని ప్రభుత్వం పేర్కొంది. అయితే గత ఆరు నెలలుగా 14 సార్లు బిల్లు చెల్లింపుల నోటీసులు పంపించినప్పటికీ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం చేశారనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది.
లక్నోకు చెందిన పుష్ప సేల్స్ హెల్త్ కేర్ సంస్థ ఆస్పత్రికి 2014 నుంచి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో 63.65 లక్షల రూపాయలు ఆస్పత్రి బకాయి పడటంతో, ఈ యేడాది ఫిబ్రవరి నుంచి సదరు కంపెనీ నోటీసులు పంపుతూనే ఉంది." పెషంట్ల ప్రాణాల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉంటారనే అనుకుంటున్నాం. మీ ఆస్పత్రిలో వాళ్లకి ఆక్సిజన్ సరఫరా ఎంత ముఖ్యమైన అంశమో మీకు తెలిసే ఉంటుంది. మీరు మా కంపెనీకి చాలా బకాయి ఉన్నారు. అయినా సప్లైను ఆపలేదు. దయచేసి ఇప్పటికైనా బకాయిలు పూర్తి చేయండి. లేనిపక్షంలో సిలిండర్ల సరఫరా కొనసాగటం కష్టమౌతుంది" అని కంపెనీ న్యాయవాది వివేక్ గుప్తా పంపిన నోటీసులో స్పష్టంగా ఉంది.
Advertisement