మాపై దుష్ర్పచారం
మాపై దుష్ర్పచారం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
పోలవరం సాకారం బాధ్యత ఏన్డీయే ప్రభుత్వానిదే
నిధులపై సీఎం చంద్రబాబుకు బెంగ అక్కర్లేదని వ్యాఖ్య
కాకినాడ: ఆంధప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని ప్రచారం చేయడం దుష్ర్పచారమేనని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించడం తప్ప మరొకటి కాదన్నారు. కేంద్రం ఇప్పటివరకూ అన్ని పథకాలు, ప్రాజెక్టులకు కేటాయింపులద్వారా రాష్ట్రప్రభుత్వానికి రూ.లక్షా నలభై వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి నిధుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని షా వ్యాఖ్యానించారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఎన్‌డీఏ ప్రభుత్వం ఎలాంటి లోటూ రానివ్వదని హామీఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బీజేపీ బహిరంగసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఉద్వేగంగా సాగింది. ఈ సందర్భంగా పలు అంశాల్ని ఆయన ప్రస్తావించారు.ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని చెప్పడంతోపాటు రాష్ట్రంలో పార్టీని బూత్‌స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునివ్వడానికే రాజమహేంద్రవరం వచ్చానన్నారు.
పోలవరం బాధ్యత కేంద్రానిదే..
ఆంధ్రప్రదేశ్‌కు జీవనధారలాంటి పోలవరం ప్రాజెక్టును సాకారం చేసే బాధ్యత బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానిదేనని అమిత్ షా భరోసానిచ్చారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వట్లేదని దుష్ర్పచారం జరుగుతోందన్నారు. ఏ ప్రాజెక్టుకైనా నిధులన్నీ ఒకే బడ్జెట్‌లో కేటాయించడం జరగదన్నారు. ఒకవేళ అ లా జరగలేదంటే.. కేంద్రం సహకరించట్లేదని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదారి పట్టించడమేనన్నారు. పోలవరం ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంలో బీజేపీ సహకారం మరువకూడదన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిందంటేనే దాన్ని పూర్తి చేయడమనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లని వివరించారు.
రాహుల్‌లో విదేశీ రక్తం ప్రవహించడమే కారణం..
దేశాన్ని ముక్కలు చేయాలంటున్న ఉగ్రవాదులను ఉరితీస్తే అందుకు మద్దతుగా మాట్లాడిన ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమర్థించ డం సరికాదని అమిత్‌షా అన్నారు. ఆయన ముత్తాత, నాయనమ్మ, తండ్రికి భిన్నంగా ప్రవర్తించడానికి రాహుల్‌లో విదేశీ రక్తం ప్రవహించడమే కారణమని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బలీయశక్తిగా బీజేపీ ఎదగాలి..
ఆద్యంతం ఉద్వేగంగా సాగిన అమిత్ షా ప్రసంగం బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నిం పింది. 11 కోట్ల మంది సభ్యులతో బీజేపీ బలీ యమైన పార్టీగా ఎదిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌సహా దక్షిణాదిలోనూ ఒక బలమైన శక్తిగా ఎదిగి, బీజేపీపై ఉత్తరాది పార్టీ అన్న ముద్రను చెరిపేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లేని భారతదేశాన్ని చూడాలన్నారు.
చిన్నమ్మ తడబాటు..: హిందీలో అమిత్ షా ప్రసంగాన్ని బీజేపీ రాష్ట్ర నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలుగులోకి తర్జుమా చేసి వినిపించారు.కొన్నిచోట్ల ఆమె తడబడ్డారు. అమిత్ షా ప్రసంగంలో ఒకచోట తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గురించి ప్రస్తావించినా ఆమె టీడీపీ ఊసెత్తలేదు. ఇదిలా ఉండగా కొన్ని నెలలుగా నలుగుతున్న ప్రత్యేక హోదా గురించి కానీ, స్పెషల్ ప్యాకేజీ గురించి కానీ అమిత్ షా తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే కాపు రిజర్వేషన్ల గురించి కూడా ఏదో ఒకటి చెబుతారని బీజేపీ కార్యకర్తలు ఆశించినా నిరాశే మిగిలింది.
సభ జరగరాదని ఆశించారు: కృష్ణంరాజు
బీజేపీ బహిరంగసభ జరగదని, జరగకూడదని చాలామంది ఆశించారని, కానీ తాము ఘనంగా జరిపి చూపించామని కేంద్ర మాజీ మంత్రి, నటుడు యూవీ కృష్ణంరాజు అన్నప్పుడు సభలో కరతాళ ధ్వనులు మోగాయి. టీడీపీ నేతలనుద్దేశించే ఆ మాటలన్నారని కార్యకర్తలు వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి వెంకయ్య తనదైన శైలిలో ప్రసంగిస్తూ మోదీ, అమిత్‌షాలపై ప్రశంసలవర్షం కురిపించారు.
టీడీపీతో పొత్తు వద్దు
దానవాయిపేట(రాజమహేంద్రవరం): రాష్ట్రంలో టీడీపీతో పొత్తుకు స్వస్తి పలకాలని కోరుతూ బీజేపీ కార్యకర్తలు కొందరు ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరంలో నిర్వహించిన బహిరంగసభలో నినాదాలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రసంగిస్తున్న సమయంలో వేదికకు కొద్దిదూరంలో ఉన్న కొంతమంది కార్యకర్తలు ఒక్కపెట్టున టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలకు దిగారు. దీంతో అప్రమత్తమైన నాయకులు వారిని వారించారు.
‘ఆయుష్’ పోయండి : మరోవైపు రాష్ట్రంలో ఆయుష్ కేంద్రాలను పరిరక్షించాలని, వాటిని మూసివేయొద్దని కోరుతూ ఆయుష్ సిబ్బంది కొందరు సభా ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి తమను ఆదుకోవాలని కోరారు.
ఆ నిధులన్నీ కేంద్రానివే..
రాష్ట్రంలో గ్రామగ్రామాన నిరంతరాయ విద్యుత్తు సరఫరా అవుతోందంటే అది ఎన్డీయే ప్రభుత్వ ఘనతేనని అమిత్‌షా చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.65 వేల కోట్లు, జలమార్గాల అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అమృత్ పథకం కింద స్మార్ట్‌సిటీల అభివృద్ధికి సంకల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణానికి రూ.1,500 కోట్లు రాష్ట్రప్రభుత్వానికి అందించినట్లు చెప్పారు. నెల్లూరులో క్రిప్‌కో, రాష్ట్ర తీరంలో క్షిపణుల పరీక్ష కేంద్రం, మంగళగిరిలో రూ.1,616 కోట్లతో ఎయిమ్స్ తరహా ఆసుపత్రి, విశాఖ సమీపంలో రూ.2,500 కోట్లతో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ, విజయనగరంలో గిరిజన వర్సిటీ, అనంతపురంలో కేంద్రీయవర్సిటీ, విశాఖలో పెట్రోలియం వర్సిటీ.. రాష్ట్రానికి కేంద్రం అందించిన సహకారం గురించి చెప్పుకుంటూ వెళితే వారమైనా పడుతుందన్నారు.