అమితోత్సాహం
తిరుమల, తిరుచానూరు శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకున్న అమిత్‌షా
శ్రీవారి ఆలయాల నిర్మాణానికి స్థలాల మంజూరుకు హామీ
తిరుమల: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకున్నారు. తన సతీమణి పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వేద పాఠశాల విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులతో ఉత్సాహంగా గడిపారు.
ప్రతిపాదనలు పంపిస్తే స్థలాలు మంజూరు చేయిస్తా
ఇతర రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపితే స్థలాలు మంజూరు చేయిస్తానని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం నిమిత్తం అమిత్ షా తిరుమలకు వచ్చారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఆలయాల నిర్మాణం అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపాదనలు పంపితే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో సత్వరమే స్థలాలు మంజూరు చేయిస్తానని చెప్పారు. అమిత్ షాకు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, కోలా ఆనంద్ ఉన్నారు.
అమిత్ షాకు ఘన సత్కారం
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అమిత్ షాను ఆ పార్టీ శ్రేణులు కోలా ఆనంద్, గుండాల గోపీనాథ్, భాస్కర్, వరప్రసాద్ ఘనంగా సత్కరించారు. ఆలయం వెలుపల పట్టువస్త్రాలతో సత్కరించి, శ్రీవారి చిత్రపటాలు, జ్ఞాపికలు అందజేశారు.