అమిత్ షాకు ఊరట
సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు నుంచి విముక్తి
తగిన ఆధారాలు లేవన్న సీబీఐ ప్రత్యేక కోర్టు
నిందితుడిగా పేర్కొనలేమంటూ అభియోగాల కొట్టివేత
ముంబై: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు పెద్ద ఊరట లభించింది. సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు నుంచి సీబీఐ కోర్టు ఆయనకు విముక్తి ప్రసాదించింది. ఈ వ్యవహారంలో సీబీఐ మోపిన అభియోగాలు ఆమోదితం కాదని అభిప్రాయపడిన కోర్టు.. అమిత్ షాను నిందితుడిగా పేర్కొనలేమని స్పష్టం చేసింది. 2005లో జరిగిన గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్‌తో పాటు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న తులసీరామ్ ప్రజాపతి హత్య కేసులో అప్పటి గుజరాత్ హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాను సీబీఐ నిందితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇతర నిందితులకు అమిత్ షాకు మధ్య ఫోన్ సంభాషణలను ఆధారాలుగా సీబీఐ చూపింది.
అయితే ఆయనను నిందితుడిగా గుర్తించడానికి ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంబీ గోసావి తాజాగా తోసిపుచ్చారు. ఆయనపై ఉన్న హత్య, కిడ్నాప్, క్రిమినల్ కుట్ర వంటి అభియోగాలను తొలగించారు. రాజకీయ దురుద్దేశంతోనే అమిత్‌ను ఈ కేసులో ఇరికించారన్న డిఫెన్స్ లాయర్ వాదనతో ఏకీభవించారు. కాగా, ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సొహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ తెలిపారు. మరోవైపు కోర్టు తీర్పును అధ్యయనం చేసిన తర్వాత అప్పీల్‌పై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ పేర్కొంది. తాజా పరిణామంపై రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి.
కోర్టు నిర్ణయంతో అమిత్ షా విషయంలో తమ పార్టీ వైఖరి సరైనదేనని తేలిందని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. తీర్పును అమిత్‌షాకు కొత్త ఏడాది కానుకగా భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ సీబీఐని దుర్వినియోగం చేసిందన్న తమ వాదన నిజమైందని, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. తీర్పు అనంతరం అమిత్ షాను ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు, మద్దతుదారులు అభినందించారు. బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాగా ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కోర్టు నిర్ణయంపై ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వ ఒత్తిడికి సీబీఐ తలొగ్గిందని ఆరోపించింది. సీబీఐ న్యాయవాది సరిగా వాదించలేదని మండిపడింది. గతంలో చూపిన ఆధారాలతో అమిత్ జైలుకు కూడా వెళ్లారని, ఇప్పుడు అవే అధారాలు ఎలా పనికిరాకుండా పోయాయని ప్రశ్నించింది.