ఎన్ కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట
న్యూఢిల్లీ: షహాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. మంగళవారం ముంబై సీబీఐ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసులో అమిత్ షా పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో ఈ కేసు నుంచి అమిత్ షా కు విముక్తి కలగనుంది.
అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్న సమయంలో షహాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసు సంచలనం రేపింది. ఆ ఘటన జరిగిన ఐదు సంవత్సరాల అనంతరం 2010 లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇందులో నాటి గుజరాత్ డీజీపీ వంజర, హోం మంత్రి అమిత్ షా సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటినుంచి బీజేపీ అధ్యక్షుడికి విముక్తి లభించింది.