సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బుద్ధిచెప్పిందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. భారత్‌తో సంబంధాలపై ఇప్పుడు పాకిస్తాన్ తేల్చుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2019లో శుక్రవారం అమిత్ షా మాట్లాడుతూ ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయన్నారు.
పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేందుకు భారత్ వైమానిక దాడులు చేపట్టిందని, మన దేశంలోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధవిమానాలను భారత్ సమర్ధంగా తిప్పికొట్టిందని అమిత్ షా పేర్కొన్నారు. పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ భారత్‌కు తిరిగి రానున్నారని చెప్పారు.
సీబీఐని మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరచలేదని అమిత్ షా చెప్పుకొచ్చారు. రాబర్ట్ వాద్రా, మాయావతిలపై కేసులు మోదీ ప్రభుత్వం హయాంలోనివి కాదని గుర్తుచేశారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడంపై వ్యాఖ్యానిస్తూ రాజకీయాల్లో ఆమె రాక నూతనంగా జరిగింది కాదని, ఆమె గత 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని అమిత్ షా అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందన్న కాంగ్రెస్ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి తమ సర్కార్ పనితీరును తప్పుపట్టే హక్కు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment