న్యూఢిల్లీ: రెండు రోజులపాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పలు రాష్ట్రాల అధ్యక్షులు, పదాధికారులు, కీలక నేతలతో భేటీ నిర్వహించారు. పార్టీ పనితీరుపై సమీక్షించారు. గత ఏడాది కాలంలో పార్టీ విస్తరణ, కార్యవర్గ సమావేశాల్లో సోమవారం చర్చించాల్సిన అంశాలపై వారితో షా మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయడం కోసం మొత్తం 4 లక్షల మంది కార్యకర్తలు 4,100 శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటనలు చేపట్టారని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు.
గత ఏడాది సెప్టెంబరు 25 నుంచి జరుగుతున్న బీజేపీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలను...ఆయన జయంతి అయిన సోమవారమే కార్యవర్గ సమావేశాల్లో ముగించనున్నారు. ఉపాధ్యాయ శతజయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ ఏడాది కాలాన్ని పేదల సంక్షేమానికి అంకితమిచ్చిందని భూపేంద్ర అన్నారు. అమిత్ షా ఇటీవలి దేశవ్యాప్త పర్యటన అంశాలు కూడా ఆదివారం నాటి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
స్వచ్ఛ భారత్, నవ భారతం తదితర కార్యక్రమాలను కూడా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా సూచించారు. సోమవారం జరగనున్న విస్తృత కార్యవర్గ సమావేశానికి 337 మంది ఎంపీలు, 1,400 మంది ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు మొత్తం కలిపి 2 వేల మందికి పైగానే హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు పడిపోవడం, నల్లధనంపై యుద్ధం అంటూ తీసుకొచ్చిన నోట్లరద్దు ప్రభావం చూపకపోవడం సహా పలు ప్రభుత్వ వైఫల్యాలపై ఇటీవలి కాలంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో విమర్శలకు సమాధానమిస్తూ, తమ ప్రభుత్వ విజయాలను చాటు తూ మోదీ ప్రసంగించే అవకాశం ఉంది.
త్వరలో రెండో దశ శిక్షణ
బీజేపీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు వివిధ అంశాల్లో శిక్షణనిచ్చే రెండో దశ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరళీధర్ రావు తెలిపారు. పంచాయతీ, పురపాలక సంఘాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు పార్టీ శిక్షణనివ్వనుందని చెప్పారు.