ఏది అమలు కాలేదో నిరూపించండి
► లక్ష కోట్ల సాయంపై అమిత్ షా సవాల్
► ఏపీలో మా నేతలు టీడీపీతో తెగతెంపులు చేసుకుందామన్నారు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రకటించిన సాయంలో తాను చెప్పిన ఏ విషయం అమలు కాలేదో చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సవాల్ విసిరారు. ఈ విషయంలో తన మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు లక్ష కోట్ల వరకు సాయం చేసిందని రాష్ట్ర పర్యటనలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యల ను ఖండించడమే కాకుండా, తప్పుడు ప్రచారం చేసినందుకు ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన అమిత్ షా.. స్పష్టమైన వివరాలతో ఏ పథకానికి ఎంత ఇచ్చామో వివరించానని చెప్పారు. తాను చెప్పింది జరగలేదని నిరూపించాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
కాగా, ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి తెగతెంపులు చేసుకుందామని బీజేపీ కార్యకర్తలు, నేతల నుంచి తనకు సలహాలు అందిన మాట వాస్తవమేనని అమిత్ షా స్పష్టం చేశారు. విజయవాడలో గురువారం జరిగిన బీజేపీ బూత్‌స్థాయి కమిటీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలుగుదాం అని ప్లకార్డులు ప్రదర్శించడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అమిత్ షా ఈ విషయం తెలిపారు. ‘ఏపీలో టీడీపీతో తెగతెంపులు చేసుకుందామని పలువురు సలహా ఇచ్చారు. ఈ మాట వాస్తవమే. ఈ విషయంలో బీజేపీ నిర్ణయం ఏంటనేది మీడియాకు ఎందుకు వెల్లడించాలి’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.