అమితాబ్ నన్ను అప్పుడే హెచ్చరించాడు!
ముంబై: పనామా ప్రకంపనల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అజయ్ దేవగణ్ చిక్కడం హిందీ సినీ పరిశ్రమను కుదిపేసింది. పన్ను ఎగవేతకు స్వర్గధామల్లాంటి దేశాల్లో బోగస్ కంపెనీలు తెరిచి.. అక్రమంగా డబ్బు దాచుకునేందుకు పనామాలోని 'మోసాక్ ఫొన్సెకా' అనే లా కంపెనీ సేవలు వీరు వాడుకున్నారన్నది ప్రధాన అభియోగం.
అయితే ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తన పేరును దుర్వినియోగం చేసి విదేశాల్లో బోగస్ కంపెనీలు తెరిచినట్టు కనిపిస్తున్నదని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై ఇటీవల ఒకప్పటి బిగ్ బీ సన్నిహితుడు, యూపీ రాజకీయ నేత అమర్‌సింగ్ ఒకింత ఆగ్రహంగా స్పందించారు. అమితాబ్ పనామా పత్రాల వివాదంలో చిక్కుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడుగగా.. 'రెండురోజుల కిందటే నేను పబ్లిగ్గా చెప్పాను. ఐశ్వర్య గానీ, అభిషేక్‌గానీ నా పట్ల అమితమైన గౌరవం చూపుతారు. అమితాబ్ తోనూ నాకెలాంటి గొడవ లేదు. నిజానికి ఆయనే నన్ను ఓసారి హెచ్చరించాడు. జయాబచ్చన్‌కు స్థిరచిత్తం ఉండదని, ఆమెను మీ రాజకీయాల్లోకి (పార్టీలోకి) తీసుకోవద్దని సూచించాడు. కానీ, నేను ఆయన ఉదాత్తమైన సలహాను వినలేదు. జయ అలవాట్లు, అస్థిరమైన ధోరణి కారణంగా ఆమె నుంచి ఎలాంటి కచ్చితత్వాన్ని ఆశించవద్దని అమితాబ్ నన్ను హెచ్చరించాడు.
ఆమె తరఫున నాకు ఆయన క్షమాపణలు చెప్పాడు కూడా. అక్కడితో ఈ విషయం ముగిసిపోయింది. కానీ ఆ తర్వాత అనిల్ అంబానీ నివాసంలో డిన్నర్ సందర్భంగా జయాబచ్చన్ వల్ల ఓ గొడవ జరిగింది. ఈ వివాదంలో బచ్చన్ కూడా తలదూర్చారు. కాబట్టి (పనామా వివాదంపై) ప్రశ్నలను అరుణ్ జైట్లీని అడగండి. లేదా ఈ వివాదాన్ని దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలను అడగండి. అదీ కుదరకపోతే అమితాబ్‌నే నేరుగా అడగండి. నన్ను వదిలేయండి. అమితాబ్ ప్రసక్తి లేకుండా శాంతియుతంగా ఉండనివ్వండి' అని అమర్ చెప్పుకొచ్చారు.