'అమితాబ్, జయబచ్చన్ అవకాశావాదులు'
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దంపతులపై రాష్ట్రీయ లోక దళ్ నేత అమర్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బచ్చన్ కుటుంబం సభ్యులు అవకాశవాదులని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. గుజరాత్ అభివృద్ధిపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అనుకూలంగా అమితాబ్ బచ్చన్ టెలివిజన్ లో ప్రకటనలు ఇవ్వడాన్ని అమర్ సింగ్ తప్పుపట్టారు. సమాజ్ వాదీ పార్టీ తరపున రాజసభ్యురాలిగా జయాబచ్చన్ ఉన్నారని.. అయితే గుజరాత్ అభివృద్దికి కారణం మోడీ అంటూ అమితాబ్ కీర్తించడం సమంజసమా అని ప్రశ్నించారు. జయ, అమితాబ్ లు అవకాశవాదులని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలని ఆయన అన్నారు.
భార్త అమితాబ్ మోడితో.. భార్య సమాజ్ వాదీ పార్టీలో ఉంటూ అవకాశ రాజకీయాలు నడుపుతున్నారని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాక సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత మోడీతో పొత్తు పెట్టుకోవడానికి బచ్చన్ కుటుంబాన్ని ములాయం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మోడీ, ములాయంల మధ్య సయోధ్య కుదర్చడానికి బచ్చన్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని అమర్ సింగ్ విమర్శించారు. గతంలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడిగా ఉన్న అమర్ సింగ్ ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతే పూర్ సిక్రి నుంచి రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ టికెట్ బరిలోకి దిగారు.