ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు పెంపు
8.7 నుంచి 8.8 శాతానికి
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ వడ్డీరేట్లపై దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం దిగొచ్చింది. ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై వడ్డీ రేటును 8.8 శాతానికి పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్‌పై మార్చి నుంచి మూడుసార్లు తన నిర్ణయాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్‌పై పన్ను విధించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం..నిరసనల నేపథ్యంలో విరమించుకుంది. ఎంప్లాయిర్ వాటా నిధులను 58 ఏళ్ల తర్వాతే ఉద్యోగి పొందేలాతీసుకున్న నిర్ణయాన్నీ మార్చుకుంది. తాజాగా ఈపీఎఫ్‌పై 8.7 శాతమే వడ్డీ చెల్లిస్తామన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.
ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.8 శాతం వడ్డీ ఇవ్వడానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారని, తక్షణం దీనిపై నోటిఫికేషన విడుదల చేస్తామని కార్మిక మంత్రి దత్తాత్రేయ తెలిపారు. 2015-16కు పీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదించగా ఆర్థిక శాఖ తిరస్కరించడంతో చివరకు 8.7శాతంగా గానే నిర్ణయించారు. దీనిపై కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒత్తిడి పెరగడంతో కేంద్రం నిర్ణయం మార్చుకుంది. ఈపీఎఫ్‌ఓ ఆదాయంపై తాజా సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. గతేడాది మిగులు నిధుల్ని వాడుకునేందుకు వీలుందని తెలియడంతో వడ్డీ రేటు పెంచారని, పూర్తి గణాంకాల్ని పరిగణనలోకి తీసుకుని ఖాతాదారుల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్నాయి తమ శుక్రవారం సమ్మె విజయవంతమైన కార్మిక సంఘాలు చెప్పాయి.