
సాక్షి,న్యూఢిల్లీ: పార్టీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించే బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా మరోసారి అగ్ర నాయకత్వంపై పంచ్‌లతో చెలరేగారు. జీఎస్‌టీ, నోట్లరద్దుతో ప్రజలు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఎన్నికలు కాదని, బీజేపీకి సవాల్ వంటివని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పుస్తకావిష్కరణ సందర్భంగా జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక వ్యవస్థపై ఓ న్యాయవాది చర్చించడం, టీవీ నటి మానవవనరుల మంత్రి కావడం, ఛాయ్ వాలా ప్రధానిగా అయినప్పుడు తానెందుకు ఆర్థిక వ్యవస్థపై మాట్లాడకూడదని సిన్హా ప్రశ్నించారు. అరుణ్ జైట్లీ, స్మృతీ ఇరానీ, నరేంద్ర మోదీల పేర్లను ప్రస్తావించనప్పటికీ, వారిని ఉద్దేశించి పరోక్షంగా సిన్హా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.తాను పార్టీని సవాల్ చేయడం లేదని, వాస్తవ పరిస్థితిని బీజేపీ ముందుంచుతున్నానని పేర్కొన్నారు.
మీరు వేరే పార్టీలో చేరుతున్నారా అని ప్రశ్నించగా మాజీ సినీ స్టార్ తనదైన శైలిలో ఖామోష్ ( నిశ్శబ్ధం) అంటూ బదులిచ్చారు.జీఎస్‌టీ, నోట్ల రద్దు సహా మోదీ ప్రభుత్వ విధాన నిర్ణయాలతో గత కొంతకాలంగా ఆయన విభేదిస్తున్నారు.