ఢిల్లీలో మరో చర్చిపై దాడి | Another church attacked in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరో చర్చిపై దాడి

Published Tue, Feb 3 2015 2:39 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

ఢిల్లీలో మరో చర్చిపై దాడి - Sakshi

ఢిల్లీలో మరో చర్చిపై దాడి

  • పూజాసామగ్రి ధ్వంసం
  • సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో మరో చర్చి విధ్వంసానికి గురైంది. దక్షిణ  ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉన్న సెయింట్ ఆల్ఫోన్సా చర్చిలోకి ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి విధ్వంసం సృష్టించారు. నగరంలో గత నవంబర్ నుంచి చర్చీలపై ఇలాంటి దాడి జరగడం ఇది ఐదోసారి. దుండగులు ఆల్ఫోన్సా చర్చి ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టి లోనికి వెళ్లారని, పలు పూజావస్తువులను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చోరీ కేసు నమోదు చేశామన్నారు.

    చర్చి సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది విద్వేషపూరిత దాడి అని క్రైస్తవులు మండిపడుతున్నారు. ఢిల్లీలో కొన్ని నెలలుగా ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయని, ఇది తమ చర్చిని అపవిత్రం చేయడానికి జరిపిన దాడి అని ఆల్ఫోన్సా చర్చి మతాధికారి ఫాదర్ విన్సెంట్ సాల్వతోర్ ఆరోపించారు. దిల్షాద్ గార్డెన్, వికాస్‌పురి, జసోలాల్లో ఇలాంటి దాడులు జరిగాయన్నారు. కాగా, తాజా ఉదంతంపై నివేదిక అందజేయాలని కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

    నగరంలోని మత స్థలాల భద్రతకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, ఇలాంటి దాడుల్లో చేసిన అరెస్టులు, ఇతర వివరాలు కూడా ఇవ్వాలంది. మతస్థలాలకు, ముఖ్యంగా మైనారిటీల ప్రార్థనా మందిరాల సమీపంలో అదనపు భద్రతా సిబ్బందిని నియమించి భద్రత పెంచాలని ఆదేశించింది. ఈ ఉదంతంపై ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు కేంద్ర హోం శాఖ అధికారులను కలసి మాట్లాడారు. జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు జస్టిస్ సిరియాక్ జోసఫ్.. ఆల్ఫోన్సా చర్చికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement