పక్కా ప్లాన్‌తో దాడి..! | Caught on Camera: BJP MLA Jitender Shunty shot at in Delhi | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌తో దాడి..!

Published Wed, Sep 3 2014 10:09 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

Caught on Camera: BJP MLA Jitender Shunty shot at in Delhi

సాక్షి, న్యూఢిల్లీ: షహదరా ఎమ్మెల్యే జితేంద్ర సింగ్ షంటీ మూడోసారి కూడా దుండగుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడంటూ 2007లో మొదటిసారిగా షంటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ఆయన స్వతంత్ర కౌన్సిలర్‌గా ఉన్నారు. మళ్లీ ఏడాది తర్వాత తనపై నుంచి ట్రక్కును తీసుకెళ్లి హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ 2008లో రెండోసారి ఫిర్యాదు చేశారు. తాజాగా మూడోసారి కూడా అతనిపై హత్యాప్రయత్నం జరిగింది. మొదటి రెండుసార్లు జరిగిన ఘటనలకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడికి స్పష్టమైన ఆధారాలున్నాయి. షంటీ ఇంటికి దుండగుడు రావడం, ఎమ్మెల్యేను కాల్చేందుకు ప్రయత్నించడం, ఇద్దరి మధ్య పెనుగులాట జరగడం వంటివి సీసీటీవీ కెమెరా స్పష్టంగా రికార్డు చేసింది. ఈ ఘటనపై కూడా షంటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 వ్యక్తిగత కక్షలే కారణమా?
 రాజకీయంగా ఆయన వేర్వేరు స్థానాల్లో ఉన్నప్పుడు దాడులు జరిగాయని, తొలి రెండుసార్లు దాడులు జరిగినప్పుడు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారని, ఈసారి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారని, దీంతో జరిగిన దాడి రాజకీయపరమైన దాడి కాదనే అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. కాగా తనపై దాడి ఎవరి పని అనే విషయమై షంటీ కూడా ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఇప్పటికీ తాను తేల్చుకోలేకపోతున్నానని, తనను చంపే అవసరం ఎవరికి ఉందనే విషయం ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని చెబుతున్నారు.
 
 పక్కా ప్లాన్ ప్రకారం...
 షంటీని చంపేందుకు వచ్చిన దుండగుడు పక్కా ప్లాన్ ప్రకారం వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. నిజానికి ఎమ్మెల్యేగా ఉన్న షంటీ రోజంతా జనం మధ్య, అంగరక్షకుల పహారాలో ఉంటారు. ఆయనకు రక్ష ణ లేకుండా ఉండేది కేవలం తెల ్లవారు జామున మాత్రమే. ఆ సమయంలో జనం కూడా ఎవరూ ఉండరు. దీంతో షంటీని హత్య చేసేందుకు ఇదే సరైన సమయం అని భావించిన దుండగుడు బుధవారం తెల్లవారు జామున ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడి జరిగిన ఘటన వివరాల్లోకెళ్తే...
 
 వివేక్ విహార్‌లోని ఝిల్మిల్‌కాలనీ ప్రతాప్ ఖండ్‌లో నివసించే షంటీ ఇంటికి తెల్లవారుజామున ఐదున్నర గంటలకు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి  డోర్‌బెల్ మోగించాడు. షంటీ తలుపుతీసుకొని బయటకు వచ్చారు. హెల్మెట్ ధరించిన ఆగంతకుడు కొన్ని పత్రాలను అటెస్ట్ చే యించుకోవడానికి వచ్చినట్లు జితేంద్ర షంటీకి చెప్పాడు.. పత్రాలను పరిశీలించిన షంటీ  తాను ఇంట్లోకి వెళ్లి వాటిని అటెస్ట్ చేసుకొస్తానని, అంతవరకు ఇంటి ముందే ఉండమని చెప్పి ఇంటిలోపలికు వెళ్లబోయారు .ఇంతలో ఓ కాగితం కిందపడడంతో దానిని తీయడం కోసం షంటీ కిందకు వంగారు. ఇదే అదనుగా భావించిన ఆగంతకుడా జేబులో నుంచి పిస్తోలు తీశాడు. దీనిని గమనించిన షంటీ వెంటనే అప్రమత్తమై ఆగంతకున్ని అడ్డుకొని, తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.  వారిద్దరి మధ్య కొంతసేపు ఘర్షణ కూడా జరిగింది. ఆగంతకునితో ఘర్షణ పడుతూనే షంటీ ఇంట్లో వారిని పిలవడం కోసం డోర్‌బెల్ మోగించారు. ఇంటర్‌లాక్ సిస్టం వల్ల తలుపుకు ఆటోమేటిక్‌గా తాళం పడింది. దీంతో ఆయన ఇంట్లోకి కూడా వెళ్లలేకపోయారు. ఆగంతకుడు మూడు సార్లు కాల్పులు జరిపిన తరువాత ఆ శబ్ధానికి ఇంట్లోంచి ఓ వ్యక్తి బయటకు రావడంతో  ఇద్దరు కలిసి ఆగంతకుని వెంబడిస్తూ బయటకు వచ్చారు. ఆగంతుడు పిస్తోలుతో మూడు నాలుగు సార్లు కాల్పులు జరిపి పారిపోయాడు. వెంట్రుక వాసిలో షంటీకి ప్రమాదం తప్పింది.
 
 మీడియాకు వివరించిన షంటీ..

 తనపై దాడి జరిగిన విషయాన్ని షంటీ వెంటనే పోలీసులకు తెలిపి, మీడియాకు కూడా సమాచారం అందించారు. వెంటనే ఢిల్లీ  పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు షంటీ నివాసానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. తన ఇంటిముందు అమర్చిన నాలుగు సీసీటీవీ కెమెరాలలో రికార్డయిన దృశ్యాలను కూడా షంటీ విలేకరుల ముందుంచారు.  సాధారణంగా తన వెంట ఎప్పుడూ గన్‌మ్యాన్, జనం ఉంటారని,  తెల్లవారుజామున తాను ఒంటరిగా ఉంటానని తెలుసుకున్న వ్యక్తులే తనపై దాడికి పూనుకున్నారని షంటీ తెలిపారు. హెల్మెట్ ధరించి ఉంచడడం వల్ల తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని తాను గుర్తించలేనని ఆయన చెప్పారు.
 
 అనేకరకాల పనుల కోసం తన దగ్గరకు జనం వస్తుంటారని, అందుకే తెల్లవారుజామునే వచ్చిన వ్యక్తిని తాను అనుమానించలేదని షంటీ చెప్పారు. ఇంట్లోంచి ఆయన బయటకు వెళ్లగానే ప్రధాన ద్వారం ఆటోమేటిక్‌గా లాక్ అయిందని, అందువల్ల ఆగంతకునితో తన భర్త ఒంటరిగా పోరాడవలసి వచ్చిందని, అదృష్టవశాత్తు ఆయనకు గాయాలు కాలేదని షంటీ సతీమణి చెప్పారు. ఇదిలా ఉండగా పోలీసులు షంటీ నివాసం ఎదుట రోడ్డుపై పడిఉన్న మూడు ఖాళీ తూటాలను తీసుకోవడంతోపాటు షంటీ వాంగ్మూలం తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి జరిపి పారిపోయిన ఆగంతుకుని ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.
 
 కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు మరొకరు కూడా ఉన్నారని, అతను షంటీ నివాసం ముందు కారు ఆపి వేచిచూస్తున్నాడని, కాల్పులు జరిపిన వ్యక్తి ఆ కారులోనే ఎక్కి పారిపోయాడని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారుపై హర్యానాకు చెందిన నంబర్ ఉందని, ఆగంతకుడు కూడా హర్యానివీ యాసలో మాట్లాడాడని ఎమ్మెల్యే మీడియాకు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షంటీపై దాడిచేయడం కోసం ముగ్గురు వ్యక్తులు మోటారుసైకిల్‌పై వచ్చారని మరికొందరు చెబుతున్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే తెల్లవారుజామున ఐదున్నర గంటలకు పత్రాలు అటెస్ట్ చేయించుకోవడానికి వ్యక్తి రావడం, అతను హెల్మెట్ ధరించి ఎమ్మెల్యేతో మాట్లాడడం, ఎమ్మెల్యే అనుమానం లేకుండా అతనితో సంభాషించడం, మూడు బుల్లెట్లలో ఒక్కటి కూడా షంటీని గాయపరచకపోవడం వంటి పరిణామాలపై పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
 
 షంటీపై దాడిని ఖండించిన నేతలు:

 షంటీపై జరిగిన దాడిని పలువురు నేతలు ఖండించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఈ దాడిని ఖండి స్తూ అటువంటి ఘటనలు జరగకూడదని అన్నారు. ఇటీవల తాను పోలీసు కమిషనర్ బస్సీని కలిశానని, అప్పుడు కూడా పలువురు ఎమ్మెల్యేలు తమ భద్రతకు ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. మరో నేత నళిన్ కోహ్లీ  కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తంచేశారు.  ఇది ఖండించదగిన, ఆందోళన చెందాల్సిన విషయమని ఆయన అన్నారు. పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి, దాడి వెనుక కారణాలను బయటపెట్టాలన్నారు. దాడి రాజకీయ శత్రుత్వం వల్ల జరిగిందా? లేక నేరగాళ్ల చర్యా అనేది తేల్చాలన్నారు. ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ దాడి ని ఖండిస్తూ దేశరాజధాని ఢిల్లీలోనే ప్రజలకు భద్రత లేనట్లయితే మరెక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement