న్యూఢిల్లీ : పౌరసత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, చాంద్‌బాగ్‌లో సోమవారం తీవ్ర హింస చెలరేగింది. ఈ ఘటనల్లో నలుగురు పౌరులు సహా, ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే, సీఏఏ వ్యతిరేక నిరసనకారుడొకరు తుపాకీ చేతపట్టి హల్‌చల్ చేశాడు. డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌కు గురిపెట్టి బెదిరించాడు. జఫ్రాబాద్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. వీడియా ఆధారంగా అతన్ని షారుఖ్ (33)గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మారణాయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. షారుఖ్‌ది ఢిల్లీలోని షాదర ప్రాంతం.
(చదవండి : సీఏఏ అల్లర్లలో హింస )
వీడియో ప్రకారం.. ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన షారుఖ్.. చేతిలో పిస్టోల్ పట్టుకుని విధుల్లో ఉన్న పోలీసును బెదిరించాడు. దగ్గరకు వస్తే కాల్చి పడేస్తానని హెచ్చరించాడు. ఈక్రమంలో గాల్లోకి కాల్పులు కూడా జరిపాడు. దాంతో నిరాయుధుడైన కానిస్టేబుల్ వెనక్కి వెళ్లాడు. కాల్పుల నేపథ్యంలో సీఏఏ అనుకూల వర్గం వారు కూడా భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇక మంగళవారం ఉదయం కూడా సీఏఏ ఆందోళనలు తగ్గుముఖం పట్టలేదు. కాగా, సీఏఏ ఘర్షణలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులతో అత్యవర భేటీ నిర్వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఎమ్మెల్యేలతో భేటీ అయి ఉద్రిక్తతలు తగ్గించేందుకు చేపట్టే చర్యలపై చర్చించారు.
(చదవండి : పాకిస్తాన్ జిందాబాద్; ‘కాల్చి పారెయ్యండి’)
Comments
Please login to add a commentAdd a comment