న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని లడక్ ప్రాంతంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న వార్తలను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కొట్టిపడేశారు. దేశంలోని ఏ ప్రాంతాన్నీ కూడా చైనాకు విడిచిపెట్టే ప్రసక్తి లేదని, దేశ భద్రతకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు. సరిహద్దుల వెంట మౌలిక సదుపాయాల కల్పనలో చైనా ముందుం దని, ఈ విషయంలో భారత్ వెనుకబడిందని అంగీకరించారు.
ఇది అందరి వైఫల్యమని పేర్కొన్నారు. గత పదేళ్ల నుంచి తమ ప్రభుత్వం వాస్తవాధీన రేఖ వెంబడి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని, ఇది చూసి చైనా భయపడుతోందని చెప్పారు. మంత్రి ప్రకటనకు ముందు... లడక్ సెక్టార్‌లో 640 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ స్వయంగా ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీయే నివేదిక ఇచ్చిందంటూ ప్రతిపక్ష బీజేపీ, యూపీఏ భాగస్వామ్యపక్షమైన సమాజ్‌వాది పార్టీ సభ్యులు లోక్‌సభను కుదిపేశారు. బీజేపీ ఎంపీలు నినాదాలతో హోరెత్తించగా.. ఎస్పీ సభ్యులు సభామధ్యలోకి దూసుకెళ్లారు.
తొలుత లోక్‌సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు యశ్వంత్ సిన్హా ఈ అంశాన్ని లేవనెత్తారు. చైనా చొరబాట్లపై రక్షణమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా ఎస్పీ సభ్యులు గొంతుకలిపారు. ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మాట్లాడుతూ ఈ పిరికి సర్కారుకు అధికారాంలో కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. అనంత రం ఆంటోనీ మాట్లాడుతూ, ‘జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ శ్యామ్ శరణ్ లడక్‌ను సందర్శించి సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలపై నివేదిక ఇచ్చారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆయన తన నివేదికలో ఎక్కడా చెప్పలేదు. మన భూభాగాన్ని చైనాకు వదిలే ప్రశ్నే లేదు’ అని చెప్పారు.
చైనా చొరబాట్లు లేవు పార్లమెంటులో ఆంటోనీ ప్రకటన
Published Sat, Sep 7 2013 4:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement