ప్రత్యేక హోదాపై చంద్రబాబు తడబాటు
న్యూఢిల్లీ: ఎన్నో వినతులు, మరెన్నో ఆశలతో హస్తినలో అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ తర్వాత చాలా బేలగా కనిపించారు. ప్రత్యేక హోదా, జల వివాదాలు, తెలంగాణ ప్రాజెక్టులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయనకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ విషయాల్లో ఏం బదులివ్వలేక, సైలెంట్‌గా ఉండలేక మింగలేక, కక్కలేని పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. పైపెచ్చు పాజిటివ్ ప్రశ్నలు అడగాలంటూ మీడియా ప్రతినిధులను కోరటం గమనార్హం.
ప్రధాని మోదీని ప్రత్యేకంగా నిధులు అడగలేదన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదన్న కోణంలో వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చి నిధులు ఇవ్వలేకపోతే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. హోదా ఇచ్చాం కదా! ఇక ఏమీ ఇవ్వబోమని కేంద్రం అంటే అప్పుడు ఏం చేస్తారు? అని ఆయన ఎదురు ప్రశ్నలు వేశారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతున్నారు? 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత ఎవరు అడిగారు? అని ఆయన విలేకరులకు ప్రశ్నలు సంధించారు.