
అన్నాహజారేను ఆహ్వానిస్తా:కేజ్రీవాల్
ఘజియాబాద్: తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి అవినీతి ఉద్యమకారుడు అన్నా హజారేను ఆహ్వానించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరుకు వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్ ఢిల్లీ ఏడవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 28న కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ తన గురువు అన్నా హజారేను ఆహ్వానిస్తానన్నారు. తనకు ఆమ్ ఆద్మీ నుంచి ఎటువంటి ఆహ్వానం అందలేదని అన్నా తెలిపిన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. అన్నాకు ఆరోగ్యం సరిగా లేనందునే ఆ కార్యక్రమానికి రాలేకపోవచ్చనే అనుమానం వ్యకం చేశారని కేజ్రీ తెలిపారు. అయినప్పటికీ ఆయనతో మరోమారు ఫోన్ లో ప్రత్యేకంగా మాట్లాడి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తానన్నారు.
కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులుగా మనీశ్ సిసోడియా, రాఖీ బిర్లా, సోమ్‌నాథ్ భార్తి, సౌరభ్ భరద్వాజ్, గిరీశ్ సోని, సత్యేంద్ర జైన్‌లు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వారం లోపల కేజ్రీవాల్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. జనవరి 1న నూతన అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.