ఏదో ఒక రోజు కేజ్రీవాల్ సీఎం అవుతారు: అన్నా హజారే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తగినన్ని స్థానాలు సంపాదించడంతో అన్నా హజారే సంతోషం వ్యక్తం చేశారు. ఏదో ఒకరోజు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారని హెచ్చరించారు. కేజ్రీవాల్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి కూడా నిరాకరించిన అన్నా హజారే.. ఇప్పుడు మాత్రం సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. దేశ రాజకీయాలకు ఢిల్లీ కేంద్ర స్థానమని, ఏకంగా 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కేవలం చీపురు కట్ట పట్టుకుని ఓడించడం అంత సులభమైన పని కాదని హజారే వ్యాఖ్యానించారు. పాత పార్టీలు బోలెడంత డబ్బు పట్టుకుని ఎన్నికల్లోకి దిగాయని, అలాంటి పరిస్థితుల్లో కూడా దాదాపు 25 స్థానాల్లో ఆధిక్యం పొందడం అంటే చిన్న విషయం కాదని చెప్పారు.
అయితే.. అదే సమయంలో మరే ఇతర పార్టీతోనూ పొత్తులు పెట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే ఉపయోగం ఏమీ ఉండదని తెలిపారు. అలాంటి ప్రభుత్వాల్లో అవినీతి రాజ్యం ఏలుతుందని అన్నారు. ఒకవేళ ఏ పార్టీ సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. పార్టీ కార్యకర్తల బలంతో ఏదో ఒకరోజు కేజ్రీవాల్ తప్పక ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నా హజారే విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకీ ప్రచారం చేయబోనని నిర్ణయించుకోవడం వల్లే ఆప్ పక్షాన కూడా ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు.