
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ అవకతవకలను వెలుగులోకి తెచ్చిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం పట్ల బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా విస్మయం వ్యక్తం చేశారు. ఆధార్ లోటుపాట్లను బహిర్గతం చేస్తే కేసులు పెడతారా..? ఇదెక్కడి న్యాయం..? అంటూ సిన్హా ప్రభుత్వంపై మండిపడ్డారు. మనమేమైనా బనానా రిపబ్లిక్‌లో ఉన్నామా అంటూ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా నిలదీశారు. దేశంకోసం, జాతి ప్రయోజనాల కోసం బయటికొస్తున్న వారినీ బాధితులుగా చేస్తున్నారని ట్వీట్ చేశారు.
సిన్హా పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్నీ, బీజేపీ ప్రభుత్వాన్నీ ఇరుకునపెట్టేలా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆధార్ అంశంలో ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా దీటుగా నిలిచిన ఎడిటర్స్ గిల్డ్‌ను సిన్హా ప్రశంసించారు. దీనిపై సుప్రీం కోర్టు స్పందించి దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వంద కోట్ల మంది ఆధార్ కార్డుల డేటా లీకయిందని ఓ వార్తా పత్రిక కథనంపై యూఐడీఏఐ అధికారి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.