జవాన్లకు బాబా రాందేవ్ యోగా!
డెహ్రడూన్: సైనికులు బాబా రాందేవ్ వద్ద యోగా పాఠాలు నేర్చుకుంటున్నారు. పశ్చిమ కమాండ్కు చెందిన 250 మంది సైనికులు ఇటీవలే హరిద్వార్లోని రాందేవ్ పతంజలీ యోగా పీఠ్లో రెండు వారాల యోగా శిక్షణను పూర్తి చేసుకున్నారు. మరో మూడు బ్యాచ్లు యోగా శిక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
మానసిక ఒత్తిడి, జీవన సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సైనికులకు చికిత్స అందించడంలో భాగంగా ముందుగా 1000 మందికి రాందేవ్ యోగా పీట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పశ్చిమ కమాండ్ ప్రతినిధి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. పతంజలి యోగా పీఠ్ సమన్వయకర్త కృష్ణ మిలాన్ మాట్లాడుతూ.. 'బాబా రాందేవ్ స్వయంగా యోగా తరగతులు నిర్వహించి సైనికులకు కొన్ని ఆసనాలు వేయడంలో శిక్షణ ఇచ్చారు. మిగిలిన కార్యక్రమం బాబా రాందేవ్ పర్యవేక్షణలో జరిగింది. ఆచార్య బాలకృష్ణ మెడిటేషన్లో శిక్షణనిచ్చారు. సైనికులకు యోగాలో శిక్షణ ఇప్పించడం మంచి నిర్ణయం' అన్నారు.