
పాక్ కుట్రలను తిప్పికొడతాం : సైన్యం
న్యూఢిల్లీ : అమర్‌నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదుల కుట్ర బహిర్గతమైంది. యాత్రా మార్గంలో మందుపాతరలను, స్నిపర్ గన్స్‌ను గుర్తించడంతో యాత్రికులు తక్షణమే అమర్‌నాథ్ యాత్రను విరమించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకునే ఉగ్రవాద కార్యకలాపాల్లో పాకిస్తాన్ సైన్యం పాల్గొంటోందని, ఉగ్రవాదానికి పాక్‌దే బాధ్యతని భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారి లెఫ్టినెంట్ జనరల్ కేజెఎస్ థిల్లాన్ అన్నారు. పాక్ కుయుక్తులను సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రకుట్రలను తిప్పికొడతామని, రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని స్పష్టం చేశారు.
ఉగ్రవాదుల్లో చేరిన స్ధానికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉగ్రమూకలతో చేతులు కలిపి భద్రతా దళాలపై రాళ్లు విసురుతున్నవారిలో 83 శాతం మంది స్ధానికులేనన్నారు. ఇవాళ రాళ్లు విసురుతున్న వారే రేపటి ఉగ్రవాదులని వ్యాఖ్యానించారు. కేవలం రూ 500 కోసం దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే దళాలపై రాళ్లు విసురుతున్నారని, వారి చర్యలను ఉపేక్షించమని హెచ్చరించారు. అమర్‌నాథ్ యాత్రకు ఆటంకం కలిగించే ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ సైన్యం దాగిఉందని పేర్కొన్నారు.