యుపి అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అఖిలేష్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ముజఫర్‌నగర్ అల్లర్లకేసులో బీజేపీ, బీఎస్సీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒక బీఎస్పీ ఎంపీతోపాటు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపైనా కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసినవారిలో బీఎస్పీ ఎమ్పీ ఖాదిర్ రానా, బీజేపీ ఎమ్మెల్యేలు సంగీత్ సోమ్, భరతేందు సింగ్, బీఎస్పీ ఎమ్మెల్యేలు నూర్ సలామ్, మౌలనా జమీల్ ఉన్నారు. అందరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. రెండురోజుల్లో వారిని అరెస్టు చేస్తామని ముజఫర్‌నగర్ పోలీసులు చెప్పారు.
ఉద్రేక ప్రసంగాల ద్వారా వారు హింసను ప్రేరిపించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం 16 మందిపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. రెండు రోజుల్లో నిందితులపై చర్యలు తీసుకోనున్నట్టు సీనియర్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నలుగురు రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేశామని, కీలక ఆధారాలు సేకరించామని చెప్పారు. మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందన్నారు. తొందర్లోనే ఇతర నిందితుల్ని అరెస్ట్ చేస్తామని ప్రవీణ్ కుమార్ చెప్పారు. ముజఫర్నగర్లో ఇటీవల జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 47 మంది చనిపోయిన విషయం తెలిసిందే.